AP Rain Alert : ఏపీలో వేగంగా మారుతున్న వాతావరణం.. ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు..
AP Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
AP Rain Alert
AP Rain Alert : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. వర్షాలపై వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగానే ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. దీంతో నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దక్షిణ కోస్తాలో తేలికపాటి వానలు నమోదయ్యే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో, దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వర్షాలతోపాటు ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్ లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. కోస్తాలో మోసర్తు వానలు పడతాయనే అంచనాలతో ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. ముందుగానే వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని.. ప్రజలకు వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు పంపించాలన్నారు. తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
