AP DWCRA womens
AP DWCRA womens : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి మహిళా సాధికారత కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు స్త్రీ నిధి, బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తున్న విషయం తెలిసిందే. స్త్రీ నిధి రుణం మీద 12శాతం వడ్డీ ఉంటే.. బ్యాంక్ లింకేజీ రుణాలపై 13శాతం వడ్డీలు వసూలు చేసేవారు. అయితే, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా సంఘాల మహిళలకు ఊరట కలిగిస్తూ వడ్డీ రేట్లపై రెండు శాంతం రాయితీ ప్రకటించింది.
ప్రస్తుతం స్త్రీ నిధి రుణాలపై 12శాతం వడ్డీ, బ్యాంక్ లింకేజీ రుణాలపై 13శాతం వడ్డీ వసూలవుతుంది. తాజాగా.. ప్రభుత్వం నిర్ణయంతో స్త్రీ నిధి రుణాలపై 10శాతం, బ్యాంక్ లింకేజీ రుణాలపై 11శాతం వడ్డీని మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అయితే, పావలా వడ్డీ పథకం కింద గతంలో రూ.3లక్షల వరకు మాత్రమే తక్కువ వడ్డీ వర్తించేది. కానీ, కొత్త నిర్ణయంతో ఎంత రుణం తీసుకున్నా కూడా రెండు శాంత రాయితీ వర్తిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వడ్డీ రేట్లపై రెండు శాతం రాయితీ వల్ల వేలాది డ్వాక్రా సంఘాల మహిళలకు పెద్ద ఊరట లభించనుంది. ఇదిలాఉంటే.. డ్వాక్రా సంఘాల్లో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం ఇటీవల మన డబ్బులు – మన లెక్కలు అనే ప్రత్యేక యాప్ ను కూడా ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా డ్వాక్రా సంఘాల్లోని సభ్యులు తమ రుణాలు, వాయిదా చెల్లింపులు, పొదుపు డిపాజిట్లు వంటి అన్ని లావాదేవీలను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. ఈ చర్యతో అక్రమాలు తగ్గి, ఆర్థిక నిర్వహణలో పారదర్శకత పెరగనుంది.