Tdp Disciplinary Committee: ఎమ్మెల్యే కొలికపూడి వర్సెస్ ఎంపీ చిన్ని.. 4న క్రమశిక్షణ కమిటీ ముందుకు.. ఏం జరగనుంది?
క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్నిలకు ఆదేశాలు అందాయి.
Tdp Disciplinary Committee: టీడీపీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. బహిరంగంగానే ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ చిన్ని డబ్బులు తీసుకున్నారంటూ ఎమ్మెల్యే కొలికపూడి చేసిన తీవ్ర ఆరోపణలు కలకలం రేపాయి.
వీరిద్దరి తీరు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో వీరి వివాదం పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు చేరింది. వారిద్దరికి క్రమశిక్షణ కమిటీ నుంచి పిలుపొచ్చింది. ఈ నెల 4న క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్నిలకు ఆదేశాలు అందాయి. 4వ తేదీన ఉదయం 11 గంటలకు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకావాలని ఎమ్మెల్యే కొలికపూడికి, అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలని ఎంపీ కేశినేని చిన్నికి సమాచారం పంపింది టీడీపీ కేంద్ర కార్యాలయం. అంతేకాదు.. అనుచరులతో కాకుండా సింగిల్ గానే రావాలని సమాచారం పంపింది.
గత ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించేందుకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని రూ.5కోట్లు తీసుకున్నారని ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు చేశారు. వాటి బ్యాంకు స్టేట్‌మెంట్లు ఇవే అంటూ తన వాట్సప్ స్టేటస్‌లో పెట్టడం తీవ్ర కలకలం రేపింది. అంతేకాదు మరికొన్ని వివాదాస్పద పోస్టులు సైతం తన స్టేటస్‌లో పెట్టారాయన.
తన మీద కొలికపూడి చేసిన ఆరోపణలపై అంతే ఘాటుగా స్పందించారు ఎంపీ చిన్ని. తాను వైసీపీ నేతలతో అంటకాగే నాయకుడిని కానన్నారు. నిఖార్సైన టీడీపీ నాయకుడినని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌లను విమర్శించే వాళ్లను తాను శత్రువుల్లానే చూస్తానన్నారు. 12 నెలల వరకు నన్ను దేవుడు అన్నాడు, ఇప్పుడు దెయ్యం అని ఎందుకంటున్నాడో కొలికపూడినే సమాధానం చెప్పాలన్నారు.
కొన్నాళ్లుగా నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్ల గొడవలు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. టీడీపీలో క్రమశిక్షణ కట్టు తప్పుతోందన్న ప్రచారంపై అధినాయకత్వం మదన పడుతోంది. పార్టీలో కీలక నేతలు, పైగా పదవుల్లో ఉన్న వారు ఒకరి మీద మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం.. వీధికెక్కడంపై సీరియస్‌గా ఉంది హైకమాండ్. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిల మధ్య వివాదంపై పార్టీ ముఖ్య నాయకులతో చర్చించారు చంద్రబాబు.
ఇక మీదట ఎవరైనా గీత దాటితే అసలు సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. పార్టీనే సుప్రీం అని.. ఎవరూ పార్టీ కంటే అతీతులు కారని స్పష్టం చేశారు. తాను చేయాల్సిన ప్రయత్నం చేస్తానన్న బాబు.. అప్పటికీ మార్పు లేకపోతే గట్టి చర్యలకు సిద్ధమని సీరియస్ వార్నింగే ఇచ్చేశారు.
Also Read: ఓడిపోయిన సీటును తిరిగి నిలబెట్టుకునే స్కెచ్ వేస్తున్న వైసీపీ? ఆ నేతను అక్కడకు పంపుతారా?
