ఓడిపోయిన సీటును తిరిగి నిలబెట్టుకునే స్కెచ్ వేస్తున్న వైసీపీ? ఆ నేతను అక్కడకు పంపుతారా?

ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపరేషన్‌ స్టార్ట్ చేశారని పార్టీ నేతల్లో టాక్ నడుస్తోంది.

ఓడిపోయిన సీటును తిరిగి నిలబెట్టుకునే స్కెచ్ వేస్తున్న వైసీపీ? ఆ నేతను అక్కడకు పంపుతారా?

Updated On : November 1, 2025 / 9:18 PM IST

YSRCP: సొంత జిల్లాలో పట్టు కోల్పోయిన సీట్లపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు వైసీపీ అధినేత జగన్. కడప జిల్లాలో ఓడిన సీట్లలో మార్పులు స్టార్ట్ చేశారు. రాబోయే ఎన్నికలకు ఇప్పటినుంచే రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా మైదుకూరులో జగన్‌ కొత్త తరహా వ్యూహం రచిస్తున్నారట. ఆ స్థానంలో తిరిగి గెలిచేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తున్న అధినేత గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే మైదుకూరు నియోజకవర్గం కడప జిల్లా రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్.

మైదుకూరు మొదటి నుంచి కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీకి బాగా పట్టున్న ప్రాంతం. ఇక్కడ మొన్నటి ఎన్నికల్లో మినహా..గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి కాకుండా బీసీలో యాదవ సామాజిక వర్గానికి చెందిన పుట్టా సుధాకర్ యాదవ్‌కు పట్టం కట్టారు మైదుకూరు ప్రజలు. (YSRCP)

Also Read: మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం.. గాయపడిన భక్తులను పరామర్శించిన లోకేశ్‌

మైదుకూరు నుంచి సుధాకర్ యాదవ్ మొదటి సారి ఎమ్మెల్యేగా గెలవడంతో అదే స్థాయి వ్యక్తిని..అదే సామాజిక వర్గం నేతను పోటీలోకి దింపాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. కడప పార్లమెంట్‌లో ఏడు స్థానాల్లో వైసీపీ నుంచి ఒక్క స్థానంలో కూడా బీసీని నిలబెట్టలేదు. కడప మైనార్టీలకు అడ్డా కావడంతో అక్కడ మైనార్టీలకు ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు జగన్.

ఇక మిగిలిన అన్ని స్థానాల్లోనూ రెడ్డి సామాజిక వర్గానికే టికెట్లు కేటాయించారు. మైదుకూరు నుంచి కూటమి తరుఫున బీసీ ఎమ్మెల్యే గెలవడంతో ఆ స్థానంలో వైసీపీ నుంచి బీసీకే అవకాశం ఇచ్చే ఆలోచన చేస్తున్నారట జగన్. దీంతో జిల్లాలో బీసీలకు అవకాశం కల్పించినట్లు అవడంతో పాటు..మైదుకూరులో టీడీపీని దెబ్బకొట్టొచ్చనే ప్లాన్‌లో ఉన్నారట వైసీపీ అధినేత.

రమేష్ యాదవ్‌ను దింపుతారా?

మైదుకూరు నుంచి బీసీని బరిలోకి దింపే క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రమేష్ యాదవ్ సొంత గ్రామం కూడా మైదుకూరు పరిధిలోనే ఉండటం..గత ప్రభత్వ హయాంలో జిల్లా ప్రజలకు సుపరిచితుడు కావడం ఆయనకు కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారట. జగన్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో పాటు జగన్ కోటరీలో కీలక నాయకుడిగా రమేష్ యాదవ్‌కు పేరుంది. ఈ క్రమంలోనే మైదుకూరుపై రమేష్‌ యాదవ్‌ కాన్సన్‌ట్రేషన్ పెరిగిందని అంటున్నారు.

ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపరేషన్‌ స్టార్ట్ చేశారని సొంత పార్టీ నేతల్లో టాక్ నడుస్తోంది. మరోవైపు ప్రొద్దుటూరు రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డితో రమేష్ యాదవ్‌కు పొసగడం లేదట. ఇప్పటికే పలుమార్లు జగన్ ప్రభుత్వ హాయాంలో ఇద్దరి నేతల పంచాయితీ హైకమాండ్ దృష్టికి చేరింది. రాచమల్లు, రమేష్ యాదవ్ మధ్య ఆ గ్యాప్ ఇంకా సెట్‌ కానట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో మైదుకూరుపై దృష్టి పెట్టిన జగన్..పుట్టా సుధాకర్ యాదవ్‌కు పోటీగా రమేష్ యాదవ్‌ను బరిలోకి దింపితే సరైన పోటీ ఉంటుందని భావిస్తున్నారట. ఇలా ప్రొద్దుటూరులో అంతర్గత పోరుకు చెక్ పెట్టడంతో పాటు మైదుకూరులో బీసీ వర్సెస్ బీసీగా రాజకీయం చేయొచ్చన్నది జగన్ ప్లాన్ అంటున్నారు. రమేష్ యాదవ్‌కు కడప ఎంపీ అవినాష్ ఆశీసులు కూడా ఉండడంతో ఈ టర్మ్ మైదుకూరు టికెట్ ఆయనకే దక్కబోతోందన్న ప్రచారం ఊపందుకుంది. మైదుకూరు బరిలో రమేష్ యాదవ్‌ను దింపితే రఘురామిరెడ్డిని ఎలా సంతృప్తి పరుస్తారనేది వేచి చూడాలి.