Kashibugga Stampede: ఒకటి కాదు 10 కేసులు పెట్టుకోండి.. నేను ఏం తప్పు చేశాను? దేవుడి గుడికి పర్మిషన్‌లు ఏంటి? కాశీబుగ్గ టెంపుల్ ఓనర్ సవాల్..

నాకు 94ఏళ్లు. ఒక్కసారిగా జనం వచ్చేశారు. వారిని కంట్రోల్ చేయలేకపోయాను. నేను పక్కకి వెళ్లిపోయాను.

Kashibugga Stampede: ఒకటి కాదు 10 కేసులు పెట్టుకోండి.. నేను ఏం తప్పు చేశాను? దేవుడి గుడికి పర్మిషన్‌లు ఏంటి? కాశీబుగ్గ టెంపుల్ ఓనర్ సవాల్..

Updated On : November 2, 2025 / 6:31 PM IST

Kashibugga Stampede: శ్రీకాకుళం జిల్లా పలాసలోని కాశీబుగ్గ వేంకటేశ్వరాలయంలో తొక్కిసలాట జరిగి 9మంది భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకులు, ఓనర్ హరి ముకుంద పండా స్పందించారు. దమ్ముంటే.. తనపై ఒకటి కాదు 10 కేసులు పెట్టుకోండి అని ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అంతా శ్రీనివాసుడు చూసుకుంటాడు అని అన్నారు. భక్తులు కోసం, మంచి జరుగుతుందని ఆలయం కట్టానని ఆయన చెప్పారు. ఆలయం కట్టడానికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన పని లేదన్నారు.

నా సొంత స్థలంలో, నా సొంత డబ్బుతో దేవాలయం నిర్మించుకున్నానని ఆయన వివరించారు. పేదలకు సాయం చేయడానికి కార్యక్రమాలు చేస్తున్నా అని వెల్లడించారు. తొక్కిసలాట మరణాలతో నాకేం సంబంధం అని ఆయన ప్రశ్నించారు. అంతమంది భక్తులు వస్తారని నాకు కూడా తెలియదన్నారు హరి ముకుంద పండా. దేవుడి గుడికి పర్మిషన్ లేంటి? అని ఆయన ప్రశ్నించారు.

”నాకు 94ఏళ్లు. ఒక్కసారిగా జనం వచ్చేశారు. వారిని కంట్రోల్ చేయలేకపోయాను. నేను పక్కకి వెళ్లిపోయాను. నా మీద కేసు పెట్టుకోండి. టెంపుల్ కట్టానని కేసు పెట్టుకోండి. నా జాగాలో నా డబ్బుతో టెంపుల్ కట్టాను. ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఈ గుడిలో నాకు పైసా రాదు. రోజూ నేనే నా చేతి నుంచి డబ్బులు పెడతాను. బియ్యం బస్తాలు తెప్పించాను. ప్రసాదం చేయించి భక్తులకు పంచి పెడతాను. 9 మంది చనిపోయారో, 10 మంది చనిపోయారో, 50 మంది చనిపోయారో నాకు తెలీదు.

నాకు తెలిసిందల్లా ఒక్కటే.. దేవుడి సేవ. ఉదయం లేచినప్పటి నుంచి శ్రీనివాసుడి సేవ చేసుకుంటాను. గుడికి వచ్చినోళ్లకు జాగ్రత్తగా వెళ్లండి అని చెబుతాను. దేవుడి ప్రసాదం ఇస్తారు తిని వెళ్లండి అని చెప్తాను. ప్రభుత్వానికి దమ్ముంటే నాపై 10 కేసులు పెట్టుకోమనండి. నేను ఏం తప్పు చేశాను? ఎవరినైనా కొట్టానా? తిట్టానా? నా ఇంట్లో డబ్బు తీసుకెళ్లి అన్నం వండి పేదలకు, భక్తులకు పెడుతున్నా. నాపై కేసు ఎందుకు పెడుతుంది?. దమ్ముంటే కేసు పెట్టండి. ఏం కేసు పెడతారో పెట్టుకోండి” అని కాశీబుగ్గ వేంకటేశ్వరాలయం ఓనర్ హరి ముకుంద పండా అన్నారు.

Also Read: ఒక్కో కుటుంబానికి రూ.15లక్షలు.. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు చెక్కులు అందజేత..