AP Municipal Act: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కీలక మార్పులు.. ఇకపై ఈవీఎంలతోనే పోలింగ్.. కొత్త జీవోలు విడుదల
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్(AP Municipal Act) ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.
- V Santhosh Kumar
- Published on- September 5, 2026 / 09:50 PM IST
AP government introduces new rules for the 2026 municipal elections.
- మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలు, నోటా
- కొత్త మున్సిపల్ చట్టం అమలు
- విప్ ధిక్కరిస్తే సభ్యత్వం రద్దు
AP Municipal Act: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన సరికొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. మున్సిపల్ చట్టాల సవరణకు సంబంధించి మూడు ప్రత్యేక జీవోలను విడుదల చేస్తూ, ఆగస్టు 28 నుంచే ‘Act No.22 of 2026’ రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించాలనే లక్ష్యంతో మేయర్, వార్డు సభ్యుల స్థానాలకు నూతన మార్గదర్శకాలను ఖరారు చేసింది.
ఈవీఎంలు, నోటా విధానం అమలు:
గతంలో మాదిరిగా బ్యాలెట్ పేపర్ల పద్ధతికి స్వస్తి పలుకుతూ ఇకపై మున్సిపల్(AP Municipal Act) ఎన్నికలలో కూడా ఈవీఎంల ద్వారానే పోలింగ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. మేయర్, వార్డు సభ్యుల ఎంపికకు ప్రత్యేక ఓటింగ్ పద్ధతిని వర్తింపజేస్తూనే, చరిత్రలోనే తొలిసారిగా మున్సిపల్ పోలింగ్‌లో ఓటర్లు ‘నోటా’ నిబంధనను వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ఓటింగ్ ప్రక్రియ వేగవంతంగా, అక్రమాలకు తావులేకుండా జరిగేలా ఈ మార్పులు దోహదపడనున్నాయి.
డిప్యూటీ మేయర్ ఎంపికపై విప్ మార్గదర్శకాలు:
డిప్యూటీ మేయర్ పదవి ఎన్నికకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితిని నిర్దేశించింది. కార్పొరేషన్ తొలి సమావేశం జరిగిన 15 రోజుల్లోపే డిప్యూటీ మేయర్ ఎన్నికను పూర్తి చేయాలని, ఎన్నికకు ఒక రోజు ముందే విప్ పత్రాన్ని సమర్పించాలని ఆదేశించింది. విప్‌ను ధిక్కరించే కౌన్సిలర్ల సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేస్తామని హెచ్చరించింది. ఒకవేళ సమాన ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను ఎంపిక చేస్తారని, ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ స్థానాన్ని 6 నెలల్లోగా భర్తీ చేయాలని స్పష్టం చేసింది.
