Cm Revanth Reddy: కల్వకుంట్ల కుటుంబమా కాస్కో.. ఇక మీకు భవిష్యత్ ఉండదు.. కేసీఆర్‌కు రేవంత్ సంచలన సవాల్
తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా దోచుకుందని, ఆ పార్టీ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముంచి గద్దె దిగిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) ఘాటుగా విమర్శించారు.
Cm revanth reddy open challenge to kcr and sensational comments on brs party
- BRS పై రేవంత్ ఫైర్
- నకిరేకల్‌లో అభివృద్ధి పనుల శంకుస్థాపన
- కేసీఆర్‌కు సీఎం సవాల్
Cm Revanth Reddy: తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా దోచుకుందని, ఆ పార్టీ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముంచి గద్దె దిగిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Cm Revanth Reddy) ఘాటుగా విమర్శించారు. నల్గొండ జిల్లా నకిరేకల్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం రాజీవ్‌గాంధీ మినీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు దారుణంగా మోసపోయారని, బీఆర్ఎస్ ఎగవేసిన రూ. 36 వేల కోట్ల రైతు భరోసా నిధులను తమ కాంగ్రెస్ ప్రభుత్వమే రైతుల ఖాతాల్లో జమ చేసిందని సీఎం స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాలు, ఉద్యోగాల భర్తీపై రేవంత్ వ్యాఖ్యలు:
తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, కేసీఆర్ కుటుంబానికి కాకుండా ఉద్యమకారుల పిల్లలకే పదవులు కట్టబెట్టామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 3.48 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీతో పాటు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ పథకాలు అందిస్తున్నామని వివరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా ఈ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ప్రజలకు మేలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు లేదని ఆయన మండిపడ్డారు.
కల్వకుంట్ల కుటుంబానికి సవాల్.. సిరిసిల్ల, సిద్దిపేటపై దండయాత్ర:
రాష్ట్రంలో బీఆర్ఎస్ అనే మొక్కను ఎదగనివ్వమని, తెలంగాణ తులసి వనంలో గంజాయి లాంటి ఆ పార్టీని పీకిపారేస్తామని రేవంత్ హెచ్చరించారు. ఈ నెలాఖరుకు సిరిసిల్ల, వచ్చే నెలలో సిద్దిపేట పర్యటనలకు వెళ్తామని సవాల్ విసిరారు. కేసీఆర్ ధైర్యముంటే అసెంబ్లీకి రావాలని, లేదంటే గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే అక్కడే తేల్చుకుందామని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో 90కి పైగా స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
