విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాదం…రమేష్ హాస్పిటల్ కు నోటీసులు…కోవిడ్ సెంటర్ కు అనుమతి రద్దు

  • Publish Date - August 14, 2020 / 09:02 PM IST

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనలో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రమేష్ హాస్పిటల్ కు జిల్లా కలెక్టర్, డీఎమ్ హెచ్ వో నోటీసులు జారీ చేసింది. నిన్న జేసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్ ఇంతియాజ్ నోటీసులు ఇచ్చారు.

భద్రతా ప్రమాణాలు పాటించలేదని, పేషెంట్ల నుంచి అత్యధిక మొత్తం వసూలు చేస్తున్నారని నిర్ధారించడంతో రమేష్ ఆస్పత్రి కోవిడ్ సెంటర్ కు ఇచ్చిన అనుమతి రద్దు చేశారు. రమేష్ ఆస్పత్రిలో కరోనా పేషెంట్స్ ను చేర్చుకోవద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

అటు రిమాండ్ లో ఉన్న ముగ్గురిని కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ సోమవారానికి వాయిదా పడింది. వారిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని అంశాలు బయటకొస్తాయిని పోలీసులు అంటున్నారు.

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. రమేష్ ఆస్పత్రిలో పని చేస్తున్న పలువురు ప్రముఖులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్ మమతను పోలీసులు 6 గంటలపాటు విచారించారు.

మమత స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ పర్యవేక్షించారని..ఆమె నుంచి కీలక అంశాలు రాబట్టామని ఏసీబీ సూర్యచంద్రరావు అన్నారు. మరోసారి మమతను విచారిస్తామని ఆయన అంటున్నారు.