ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఎస్‌ఈబీ పరిధిలోకి ఎర్రచందనం అక్రమ రవాణా, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, డ్రగ్స్‌

  • Publish Date - November 26, 2020 / 08:01 PM IST

AP government SEB expand : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పరిధిని విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌, ఎర్రచందనం, డ్రగ్స్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటివరకూ ఇసుక, మద్యం అక్రమ రవాణా అడ్డుకోవడానికే పరిమితమైన ఎస్‌ఈబీ..ఇకపై ఎర్రచందనం అక్రమ రవాణా, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, డ్రగ్స్‌ను పర్యవేక్షించనుంది.



ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై కొరడా ఝలుపించేందుకు ఏపీ సర్కార్‌ సిద్ధమైంది. ఇకపై ఆన్‌లైన్‌ క్రికెట్, రమ్మీ, గ్యాంబ్లింగ్‌, డ్రగ్స్‌, ఎర్రచందనం, ఇతర నిషేధిత పదార్థాలతో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మొదటి నుంచి అక్రమ దందాలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన ఏపీ సర్కార్‌… వీటన్నింటినీ ఎస్ఈబీ పరిధిలోకి తెస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.



నిన్న …మొన్నటి వరకూ కేవలం ఇసుక అక్రమ రవాణా, మద్యం అమ్మకాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పరిమితమై ఉంది. ఇకపై అన్ని రకాల గ్యాంగ్లింగ్‌, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, డ్రగ్స్‌ , ఎర్రచందనం, నిషేధిత గుట్కా లను కూడా ఎస్ఈబీ పరిధిలోకి తెచ్చింది. ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ , రమ్మీ ఆటలతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.



వీటిని నిషేధించినా..అక్కడక్కడా తరచూ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీనికోసం పక్కా వ్యవస్థ లేకపోవడంతో నియంత్రణ కొరవడింది. ఇప్పుడు ఎస్ఈబీ పరిధిలోకి తీసుకురావడంతో బెట్టింగ్‌ బాబులకు ముచ్చెమటలు పట్టుకున్నాయి.