AP Govt
AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కారవాన్ టూరిజంలో సరికొత్త అవకాశాలకు ప్రభుత్వం తెరతీసింది. టూరిజం పాలసీలో కారవాన్ టూరిజాన్ని కూడా చేర్చుతూ పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. తద్వారా రాష్ట్రంలో కారవాన్‌లు, కారవాన్ పార్కుల ఏర్పాటును ప్రోత్సహించడానికి కొత్త మార్గదర్శకాలు విడుదల చేశారు.
పర్యాటక విధానం 2024- 2029లో భాగంగా రాష్ట్రంలో కారవాన్లు, సంబంధిత పార్కులు ఏర్పాటు చేసే సంస్థలకు ఏటా రూ.5కోట్లు దాటకుండా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది. అంతకంటే మించితే మరుసటి ఏడాది చెల్లించాలని నిర్ణయించింది. అంతేకాదు.. కారవాన్‌లకు జీవితకాలం పన్నులో 100శాతం రాయితీ, ఏడేళ్లపాటు ఎస్జీఎస్టీ తిరిగి చెల్లింపు వంటి ఆకర్షణీయమైన పథకాలు ప్రకటించింది. ఈ చర్య ద్వారా రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య 20శాతం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రాబోయే ఐదేళ్లలో 25 కారవాన్ పార్కులను అభివృద్ధి చేయాలని, 150 వరకు కారవాన్ వాహనాలను టూరిజంలో భాగంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా సుమారు ఐదువేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. వాహనాల్లో ప్రత్యేక సదుపాయాలు ఉండాలి. ప్రత్యేక ప్రయోజనాల కోసం రూపొందించిన కేటగిరీ-ఎం (మోటారు) వాహనమై ఉండాలి. వాహనంలో కూర్చోవడానికి సీట్లు, టేబుల్ తప్పనిసరిగా ఉండాలి. సీట్లను నిద్రపోయేందుకు వీలుగా మార్చుకునే వెసులుబాటు కల్పించాలి. వంట, ఆహార పదార్థాల నిల్వకు అవకాశం ఉండాలి. కారవాన్, ప్రయాణించే వారికి, అంతర్గత పరికరాలకు బీమా సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది.
కారవాన్ పార్కుల ఏర్పాటుకు పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన స్థలాలు కేటాయించనున్నారు. పర్యాటక విధానంలో భాగంగా పార్కులు ఏర్పాటు చేసే ప్రైవేట్ సంస్థలకు ఏడేళ్ల వరకు ఎస్జీఎస్టీ తిరిగి వెనక్కి చెల్లించనున్నారు. సందర్శనీయ ప్రాంతాలకు పర్యాటకులను తీసుకెళ్లే కారవాన్ వాహనాలను పార్కుల్లో పార్కింగ్ చేయొచ్చు. పార్కుల్లో పర్యాటకులకూ వసతి, భోజన సదుపాయం అందుబాటులో ఉంటుంది. గండికోట, సూర్యలంక, బీచ్ వరకు తదితర ప్రాంతాల్లో తొలి దశలో కారవాన్ పార్కులు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.