ఏపీలో కూటమి సర్కార్ పాలనకు ఏడాది పూర్తి.. వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ప్రభుత్వం..

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలన - స్వర్ణాంధ్ర ప్రదేశ్’ పేరుతో రాష్ట్ర స్థాయి సభను నిర్వహించనున్నారు.

Pawan Kalyan Chandrababu Naidu

AP Govt: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనకు ఇవాళ్టి (జూన్ 12)తో ఏడాది పూర్తయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి సర్కార్‌ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ అభివృద్ధి పథంలో నడుస్తోంది. ఏడాది పాలనలో అమరావతి రాజధాని, పోలవరం లాంటి స్వప్నాలను సాకారం చేస్తూ ముందుకు సాగుతోంది.

 

కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలన – స్వర్ణాంధ్ర ప్రదేశ్’ పేరుతో రాష్ట్ర స్థాయి సభను నిర్వహించనున్నారు. కృష్ణా జిల్లాలోని పోరంకి వద్ద ఉన్న మురళి రిసార్ట్స్ లో సాయంత్రం 5గంటలకు ఈ సభ జరగనుంది. వర్షం కారణంగా సచివాలయం సమీప ప్రాంతం నుండి మురళి రిసార్ట్‌కు సభ ప్రాంతాన్ని మార్చారు. దీంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర పండుగలా ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు తప్పకుండా హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరు కానున్నారు. ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమ ప్రసంగాల ద్వారా వివరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేక్ కటింగ్ లు, ర్యాలీలను కూటమి నేతలు నిర్వహించనున్నారు.

 

ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో ఏపీలోని విద్యార్థుల తల్లులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సూపర్ సిక్స్ లో ముఖ్యమైన హామీ అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అందరికీ ‘తల్లికి వందనం’ పథకం అమలు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం అమలు చేయనున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేసిన విషయం తెలిసిందే.