నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. రేపు లేదా ఎల్లుండి పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ ను తిరిగి విధుల్లో చేరాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ నిమ్మగడ్డ రమేష్ రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండటానికి తగదంటూ స్పెషల్ లీవ్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ ఎల్ పీ వివరాలను మస్తాన్ వలీ తరపు న్యాయవాదులకు సుప్రీంకోర్టు నుంచి సమాచారం వెళ్లింది.
రేపు లేదా ఎల్లుండి నిమ్మగడ్డ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కనకరాజును నియామకం చెల్లదంటూ గతంలో హైకోర్టు స్పష్టం చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ ఉత్తర్వులను కొట్టివేస్తూ సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. అయితే ఇది పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంటుంది.
వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా నిమ్మగడ్డ రమేష్ రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. వైసీపీ టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రజాస్వామ్యబద్ధమైన పదవిలో ఉండటానికి నిమ్మగడ్డ రమేష్ అనర్హుడని విమర్శించింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు వినిపిస్తారనేది ఉత్కంఠగా మారింది.