Ration Rice Cash Transfer : ఏపీలో రేషన్ కార్డుదారులకు అలర్ట్.. బియ్యానికి నగదు బదిలీ వాయిదా

రేషన్ బియ్యానికి నగదు బదిలీ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి దీన్ని వాయిదా వేసింది.

Ration Rice Cash Transfer

Ration Rice Cash Transfer : ఆంధ్రప్రదేశ్ లో రేషన్ బియ్యానికి నగదు బదిలీ వాయిదా పడింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేషన్ బియ్యానికి నగదు బదిలీపై పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డుదారులకు నగదు బదిలీని ప్రస్తుతానికి పక్కన పెట్టామని మంత్రి చెప్పారు. యాప్ లో సాంకేతిక లోపం వల్ల ప్రస్తుతానికి నగదు బదిలీ నిలిపివేశామన్నారు. నగదు బదిలీపై తర్వాత ఏమైనా నిర్ణయం తీసుకుంటే సమాచారం తేలియజేస్తామని మంత్రి వెల్లడించారు.

రేషన్ బియ్యానికి నగదు బదిలీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను మంత్రి ఖండించారు. పేద ప్రజలకు నగదు బదిలీ పథకంపై ప్రతిపక్ష పార్టీలు అపోహలు సృష్టిస్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నగదు బదిలీ ప్రారంభించాలని‌ 2017లోనే కేంద్రం సూచించిందని గుర్తు చేశారు. కేంద్రం ఆదేశాలపై అదే పార్టీ నేతలు విస్మరించడం విడ్డూరంగా ఉందని సోము వీర్రాజు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కారుమూరి. రేషన్ నగదు బదిలీ పథకాన్ని ముందు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు.(Ration Rice Cash Transfer)

ఇందులో ఎలాంటి బలవంతం లేదన్న మంత్రి.. ఇష్టం ఉన్న వాళ్లకి డబ్బులు బదిలీ చేస్తారని చెప్పారు. ఇష్టం లేని వాళ్లకి బియ్యం ఇస్తామని స్పష్టం చేశారు. బియ్యానికి ఇచ్చే డబ్బుల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి ధ్వజమెత్తారు. రాష్ట్రాల్లో కేంద్రం సూచనలతోనే ఇప్పటికే ఈ పథకం అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దీనిపై ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. రేషన్‌కు సంబంధించిన నిజమైన లబ్ధిదారులకు కార్డులు తొలగిస్తామని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. జూన్‌లో కొత్త కార్డులు ఇవ్వబోతున్నట్లు మంత్రి తెలిపారు.

AP Govt: రేషన్ బియ్యం వద్దంటే డబ్బులు.. మే నుంచి ఏపీలో నగదు బదిలీ పథకం

రేషన్ బియ్యానికి నగదు బదిలీ పథకాన్ని మే నెల నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. రేషన్ బియ్యం వద్దంటే కార్డుదారులకు బియ్యానికి బదులుగా ప్రతి నెలా డబ్బులు వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. ముందుగా కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. కొన్ని నెలల పాటు డబ్బులు తీసుకుని.. ఆ తర్వాత బియ్యం కావాలన్నా తీసుకోవచ్చు అని ప్రభుత్వం చెప్పింది. విశాఖ జీవీఎంసీ పరిధిలో ఉన్న అనకాపల్లి, గాజువాక ప్రాంతాలతో పాటు నర్సాపురం, నంద్యాల, కాకినాడలను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. రేషన్ కార్డు దారుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని అనుకున్నారు. అయితే, ప్రస్తుతానికి ఈ పథకాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

రేషన్‌ రైస్‌ వద్దనుకునే వాళ్లకు ఆ మేరకు డబ్బును అకౌంట్లో జమ చేయడమే.. రేషన్ బియ్యానికి నగదు బదిలీ స్కీమ్. అయితే, ఎంతిస్తారు? కిలో బియ్యాన్ని ఎంతకు కొంటారు? ఇదింకా ఫైనల్‌ కాలేదు. కానీ, దీని వెనక పెద్ద కుట్రే ఉందని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు గుప్పించాయి.(Ration Rice Cash Transfer)

రేషన్ బియ్యానికి నగదు బదిలీపై ఏపీలో పెద్ద రచ్చ జరిగింది. రాజకీయ రంగు పులుముకుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్రమైన ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం చేశాయి. బ్లాక్‌ మార్కెటింగ్‌ మాఫియాతోపాటు ప్రభుత్వ పెద్దల హస్తం ఇందులో ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు ప్రతిపక్ష నేతలు. 40 రూపాయల ఖరీదైన బియ్యానికి 15 రూపాయలు చెల్లిస్తారా? ఇదెక్కడి విడ్డూరం అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టాల్సిన ప్రభుత్వమే, మాఫియాగా మారితే ప్రజలకు న్యాయమెలా జరుగుతుందని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రశ్నించారు.

Karumuri Nageswara Rao : రైతుల కల్లాల దగ్గరికే వెళ్లి ధాన్యం కొనుగోలు-మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

కాగా, సోము వీర్రాజు ఆరోపణలను పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొట్టిపారేశారు. అసలీ పథకం తాము తెచ్చింది కాదని.. మీ బీజేపీ ఏలుతున్న కేంద్ర ప్రభుత్వం చెబితేనే అమలు చేస్తున్నామని కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు రేషన్‌ బియ్యం-నగదు బదిలీపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. బియ్యం కావాలంటే బియ్యం ఇస్తాం, నగదు కావాలంటే నగదు ఇస్తాం, ఇందులో ఎలాంటి బలవంతం లేదన్నారు మంత్రి కారుమూరి. తెలంగాణలో బాయిల్డ్‌ రైస్‌పై వార్‌ జరుగుతుంటే, ఏపీలో రేషన్‌ రైస్‌ కు నగదు బదిలీ ప్రకంపనలు రేపింది.

మరోవైపు ఈ పథకం రూపకల్పనపై ప్రభుత్వం ఆలోచనలో పడిందనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. ప్రస్తుతం బియ్యానికి బదులు నగదు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం లబ్దిదారుల నుంచి సంతకాలు తీసుకుని నగదు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ఓసారి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాక తిరిగి బియ్యమే కావాలని లబ్దిదారులు కోరితే అప్పుడు ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇలా పలుమార్లు ఆప్షన్లు మార్చుకుంటుంటే పథకం అమలు కష్టతరంగా మారుతుంది. అందుకే పోర్టబిలిటీ ఇచ్చే విషయంలో ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం.