కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షల ధరలు తగ్గించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ ల్యాబ్స్ లో రూ.2వేల 900 ఉన్న స్వాబ్ టెస్టు ధరను రూ.1900కు తగ్గించింది. అలాగే ప్రభుత్వం పంపించే శాంపిల్స్ టెస్టింగ్ ధర రూ. 2,400 నుంచి రూ. 1600కు కుదించింది.
గతంతో పోలిస్తే కరోనా నిర్ధారణ కిట్‌ల తయారీ పెరగడంతో ప్రభుత్వం ధరలు తగ్గించింది. ఎక్కువమంది అనుమానితులకు పరీక్షలు అందుబాటులో ఉండాలని రేట్లు తగ్గించినట్లు తెలిపింది. అన్ని జిల్లాల వైద్యారోగ్యశాఖాధికారులు ప్రైవేట్ ల్యాబ్‌ల ధరలపై పర్యవేక్షణ ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ప్రతి రోజు పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
4లక్షలకు చేరువలో కరోనా కేసులు:
ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో బుధవారం(ఆగస్టు 26,2020) 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా బారిన పడి మరో 81 మంది మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో 61వేల 838 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 10వేల 830 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 3లక్షల 82వేల 469కు పెరిగాయి.
ఇప్పటివరకు 34లక్షల కరోనా టెస్టులు:
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3వేల 541కు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 34లక్షల 18వేల 690 టెస్టులు చేశారు. పెద్ద ఎత్తున పరీక్షలు చేయడం వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో వెలుగులోకి వస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
https://10tv.in/give-money-to-poor-distractions-through-media-wont-help-rahul-gandhi/