విమర్శ మంచిదే.. కానీ, దానికో హద్దు ఉంటుంది. విధానాల మీద విమర్శలు, రాజకీయ పోస్టులు ఓకే. బట్ పర్సనల్ అటాకింగ్, ఫ్యామిలీ టార్గెటింగ్ ఎక్కువై పోయింది. ఏకంగా ఆడవాళ్లను రోడ్డుకీడుస్తున్నారు కొందరు. పార్టీ సోషల్ మీడియా వారియర్స్ పేరుతో పెడుతోన్న పోస్టులు మహిళలను, రాజకీయ నేతల కుటుంబాలను హర్ట్ చేస్తున్నాయి. కొన్నిసార్లు పోనీలే ఊరుకుంటున్నా..ఏ మాత్రం పాలిటిక్స్‌తో సంబంధం లేనివారిని కూడా కాంట్రవర్సీలోకి లాగడంతో రచ్చ రంబోల అవుతోంది.
ఈ మధ్య ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల ఓవరాక్షన్ ఎక్కువై పోయిందట. అడ్డగోలుగా పోస్టులు పెడుతూ.. అటు వైఎస్ షర్మిల, ఇటు పవన్ కల్యాణ్ కూతుర్లు, హోంమంత్రి అనితతో పాటు పలువురు మహిళలపై అసభ్యంగా పోస్టులు పెట్టడం ఇష్యూ సీరియస్ అయిపోయింది. పోలీసులకు కంప్లైంట్స్ ఇస్తే..దారుణంగా ఉన్న సోషల్ మీడియా పోస్టులుపై కూడా పెద్దగా యాక్షన్ ఉండటం లేదట.
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మీద పోస్ట్ పెడితే కూడా పెద్దగా యాక్షన్ తీసుకోలేదట. పైగా పవన్ కల్యాణ్ కూతుర్లపై అసభ్యకర పోస్ట్ పెట్టిన వ్యక్తికి నోటీసులు ఇచ్చి వదిలేశారట. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిపై యాక్షన్ తీసుకోకపోవడం..నోటీసులు లైట్ తీసుకోవడం వివాదం అవుతోంది. అంత దారుణంగా సోషల్ మీడియా పోస్ట్ పెడితే కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదని కూటమి నేతలే..ప్రతిపక్ష నేతల్లాగా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం సభలో లా అండ్ ఆర్డర్‌పై తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది.
పోలీసుల రాచమర్యాదలు
సోషల్ మీడియా పోస్టుల వివాదం ఇలా నడుస్తుండగానే.. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న బోరుగడ్డ అనిల్‌కు పోలీసులు రాచమర్యాదలు చేయడం హాట్ టాపిక్ అయింది. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న బోరుగడ్డ అనిల్‌ను మంగళగిరి కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకొచ్చిన ఎస్కార్ట్ పోలీసులు..అతడిని ఓ వీఐపీలా ట్రీట్ చేశారు. లగ్జరీ రెస్టారెంట్‌లో విందు భోజనం పెట్టించి..ఆయనతో కలిసి లంచ్ చేశారు. బిల్ కూడా అనిలే పే చేశారట.
ఈ విషయం స్టేట్ పోలీస్ బాస్‌కు తెలియడంతో..ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. రూల్స్ ప్రకారం రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్‌కు..వాహనంలోనే ఉంచి ఆహారం అందివ్వాలి. కానీ అతడ్ని ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్లి బిర్యానీ పెట్టించడంతో పాటు..అతనితో కలిసి లంచ్ చేసినట్లు వీడియోలు బయటికి రావడంతో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అయితే నోటీసులు..లేకపోతే రాచమర్యాదలు అన్నట్లుగా పోలీసులు బిహేవ్ చేయడం కూటమి నేతలకు కోపం తెప్పిస్తోంది.
ఏపీ ప్రభుత్వంలోని ముఖ్యనేతలను, వారి ఇంట్లో ఆడపిల్లలను, మహిళలను కించపరిచేలా వైసీపీ నేతలు, మద్దతుదారులు సోషల్‌మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహంతో ఉన్నారు. ఇదే విషయంపై ఆయన క్యాబినెట్ భేటీలో ప్రస్తావించారు. తన కూతుర్లపై అభ్యంతరకర పోస్టులు పెట్టారని, వాటిని చూసి వాళ్లు కన్నీరు పెట్టడం తనను తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారట. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో మంచితనాన్ని చేతగానితనం అనుకుంటే ఉపేక్షించేది లేదంటూ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. నెల రోజుల్లో మొత్తం పోలీసు వ్యవస్థను గాడిలో పెడదామన్నారు.
తగిన బుద్ధి చెప్పేలా చట్టాలు..
సోషల్ మీడియా పోస్టులపై సీరియస్‌గానే ఫోకస్ చేసింది కూటమి సర్కార్. ప్రభుత్వంపై, కూటమి నేతలపై బ్యాడ్ ఓపీనియన్ క్రియేట్ చేసేట్లుగా పోస్టులు పెడుతున్న వారిని తొక్కి నార తీస్తామంటోంది. పోస్ట్ పెడితే రోస్టేనని చెప్పేస్తోంది. ఆడబిడ్డలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తగిన బుద్ది చెప్పేలా చట్టాలు తీసుకొస్తామన్నారు చంద్రబాబు. ఆడబిడ్డలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. మీరు మనుషులేనా.? మీకూ మృగాలకు తేడా ఏంటి.? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని హననం చేయడమా.? అసభ్య, అశ్లీల పోస్టులు పెట్టడమా.? ఏ చట్టం మీకు హక్కు ఇచ్చిందంటూ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. పకడ్బందీగా చట్టం తీసుకొస్తామంటూ సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెట్టే వారికి వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు.
వరుసగా ఒక్కో సోషల్ మీడియా పోస్ట్ ఇష్యూ తెరమీదకు వస్తుండటంతో ఉక్కుపాదం మోపాలని కూటమి సర్కార్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలంటేనే భయపడే పరిస్థితి తీసుకురావాలని భావిస్తోంది. అందుకు ఈ మధ్య జరిగిన ఘటనలను బేస్ చేసుకుని..మహిళల మీద పోస్ట్‌లతో పాటు..ప్రభుత్వం మీద కూడా అడ్డగోలుగా పోస్ట్‌లు పెట్టకుండా వ్యూహాన్ని అమలు చేసే చర్యలు తీసుకుంటున్నారు కూటమి పెద్దలు. అయితే వైసీపీ మాత్రం కావాలని టార్గెట్ చేసి..ప్రతిపక్షం గొంతు మూయించే కుట్ర జరుగుతుందని మండిపడుతోంది.
అలాంటి సైకోలను వదలొద్దు, వారి అంతు చూడండి- చంద్రబాబు ప్రభుత్వానికి షర్మిల విజ్ఞప్తి..