AP Anti Narcotics Taskforce (Photo Credit : Google)
Drug And Narcotics Control : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి కట్టడికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్ పై ఇక యుద్ధమే అన్నారు. గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలన్నారు లోకేశ్. నార్కోటిక్స్ నియంత్రణపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఇకపై ఈగల్ మార్పు చేసినట్లుగా తెలిపారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ఈగల్ కమిటీలు వేస్తామన్నారు.
గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం వేసిన సబ్ కమిటీ ఇవాళ హోంమంత్రి అనిత అధ్యక్షత సమావేశం అయింది. ఈ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ కొన్ని కీలకమైన ప్రతిపాదనలు చేశారు. గంజాయి కట్టడి విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ఎలాంటి రాజీ ఉండకూడదని ఆయన తేల్చి చెప్పారు. గంజాయి, మాదకద్రవ్యాలు వ్యాపారం, విక్రయాలు చేస్తున్న వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ పూర్తి స్థాయిలో కట్ చేయాలని లోకేశ్ ప్రతిపాదించారు. అలాగే పాఠ్య పుస్తకాల్లోనూ చేర్చాల్సిన అవసరం ఉందన్నారు.
గంజాయి, మాదకద్రవ్యాల వల్ల కలిగే చెడు పరిణామాలపై విద్యార్థులను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నప్పటి నుంచే వారిని చైతన్యవంతం చేయడం ద్వారా ఈ గంజాయి, మాదకద్రవ్యాలకు విద్యార్థులు బానిసలు కాకుండా ఉంటారని లోకేశ్ చెప్పారు. తన పాదయాత్ర సందర్భంగా అనేకమంది తల్లులు.. గంజాయి, మాదకద్రవ్యాల కారణంగా తమ కుటుంబాలు పడుతున్న బాధలను తనకు తెలియజేశారని లోకేశ్ వెల్లడించారు. తమ ప్రభుత్వం వస్తే డ్రగ్స్ వ్యవహారంలో కఠినంగా వ్యవహరిస్తుందని ఆరోజే వారికి హామీ ఇచ్చానని లోకేశ్ చెప్పడం జరిగింది.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణకు పాల్పడే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రి లోకేశ్ చెప్పారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణ చేసే వారి ఫొటోలు, వివరాలను ఒక ప్రత్యేకమైన వెబ్ సైట్ ఓపెన్ చేసి అందులో పెట్టాలన్నారు. ఇక పోలీస్ స్టేషన్ లో రౌడీషీటర్ల ఫోటోలు ఏ విధంగా పెడతారో అదే విధంగా వీరి ఫోటోలు పెట్టాలన్నారు. ఈ విధంగా ఇతరులను అప్రమత్తం చేసినట్లు అవుతుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు.
Also Read : అదానీ సోలార్ ప్రాజెక్టు విషయంపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే?