Liquor Shops
వాళ్లకు చేతినిండా పని దొరికింది. వీళ్లకు కోరుకున్న బ్రాండ్..కావాల్సినంత మందు దొరకబోతుంది. టెండర్లు అయిపోయాయి. లక్కీ డ్రాలో లక్కు తెలబోతుంది. కొత్త సీసాలో కొత్త మందును టేస్ట్ చేయబోతున్నారు మందుబాబులు. ఐదేళ్ల తర్వాత అమల్లోకి వస్తున్న కొత్త మద్యం పాలసీ వ్యాపారుల్లో కిక్కు పెంచుతోంది. లాటరీలో వైన్ షాప్ దక్కితే చాలు.. రాబోయే రెండేళ్లు ఈ కాలు నాదే..ఆ కాలు నాదే అని పుష్ప డైలాగ్ కొట్టొచ్చని ఊహల్లో తేలియాడుతున్నారు.
ఒక్క షాప్ దక్కితే చాలు దేవుడా..పెద్దగా ఎదిగిపోతామని కలలు కంటున్నారు. పొలిటికల్ లీడర్ల నుంచి దళారుల వరకు అందరూ సరికొద్ద యాపారానికి తెరదీస్తున్నారు. దరఖాస్తు దాఖలులో చివరి నిమిషం వరకు స్ట్రాటజీలు ప్లే చేశారు. వ్యాపార వాంఛ, రాజకీయ కాంక్షల మధ్య మధ్యవర్తుల రాయబారాలు జరిగాయి.
సిండికేట్ అయి టెండర్లు
చాలాచోట్ల ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు లిక్కర్ దందా కోసం భారీగా దరఖాస్తులు చేశారు. సిండికేట్ అయి టెండర్లు వేశారు. లక్కీ డ్రాలో..అదృష్టం తలుపుతడితే ఇక ఓ ఊపు ఊపేద్దామని ఫిక్స్ అయిపోయారు. కొన్ని ఏరియాల్లో అయితే ఎమ్మెల్యేలు కనీసం పది దుకాణాలు తనకు వదిలేయాలని కోరుతున్నారట. మరో నాయకుడు తన పరిధిలోని షాపుల్లో 20 శాతం వాటా అడుగుతున్నట్లు టాక్. గతంలో రూ.50వేలు తిరిగిరాని డిపాజిట్‌గా ఉండేది.
ప్రస్తుతం ఆ మొత్తం రూ.2 లక్షలకు పెరిగింది. దీంతో ఎక్కువ దరఖాస్తుల దాఖలంటే అయ్యేపనికాదని వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడ్డారు. ఏ ఒక్కరికి లాటరీలో దుకాణం వచ్చినా అందరికీ వాటాలుండేలా ఒప్పందం చేసుకున్నారు. అధికారం, అపోజిషన్ అని ఏం లేదు..ఇది యాపారం అంటున్నారు. లక్కీ డ్రాలో షాపు వస్తే వాటాలు పంచుకునేందుకు కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఉన్నారు.
జాతకాలు చూసుకుని మరీ టెండర్
సిండికేట్ వ్యాపారుల్లో కొందరు జాతకాలు చూసుకుని మరీ టెండర్ వేశారు. పేరు, నక్షత్రాన్ని బట్టి ఎవరి జాతకం బలంగా ఉందో వారి పేరిట అర్జీ పెట్టుకున్నారు. కొందరు పేరు మీద బాగుందనుకుంటే వాళ్లు ఇన్వెస్ట్ చేయకున్నా సరే..ఆధార్‌కార్డు తీసుకెళ్లి ఆ పేరుతో దరఖాస్తు పెట్టారు. ఇక రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం పోటెత్తారు దరఖాస్తు దారులు. 3వేల 396 మద్యం దుకాణాలకు 65వేల 5వందలకుపైగా అప్లికేషన్లు వచ్చాయి.
దరఖాస్తులతోనే ప్రభుత్వానికి రూ.13 వందల కోట్లపైన ఆదాయం వచ్చింది. టెండర్ల విధానంతో పార్టీలతో సంబంధం లేకుండా లాటరీలో ఎవరైనా షాపులు దక్కించుకునే అవకాశం ఉంది. అంతేకాదు తెలంగాణ నుంచి వెళ్లి కొందరు ఏపీలో షాపుల కోసం టెండర్లు వేశారు. అమెరికా నుంచి కూడా కొందరు దరఖాస్తు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక డ్రాలో షాపు వస్తే లిక్కర్ దందా చేయాలనుకునేవారికి మంచి రోజులు వచ్చేనట్లే. మందబాబులకు కూడా గత ఐదేళ్ల కంటే ముందున్న బ్రాండ్లు మళ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Amrapali: ఆమ్రపాలి విషయంలో కేంద్రానికి లేఖ రాయనున్న తెలంగాణ ప్రభుత్వం!