ఎన్టీఆర్ జిల్లాకు రూ.50 కోట్లు.. వరదలతో నష్టపోయిన జిల్లాలకు నిధులు విడుదల

ఆయా జిల్లాలకు నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు సర్కార్.

Ap Floods : ఏపీలో భారీ వర్షాలతో నష్టపోయిన జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వదర సహాయక చర్యల కోసం రూ.67 కోట్ల నిధులను రిలీజ్ చేసింది. ఎన్టీఆర్ జిల్లాకు 50 కోట్లు, కృష్ణా జిల్లాకు 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇక వరదలతో అతలాకుతలమైన అల్లూరి సీతారామరాజు జిల్లాకు 2 కోట్లు, పల్నాడు జిల్లాకు 4 కోట్లు, గుంటూరు జిల్లాకు 2 కోట్ల రూపాయలు ప్రకటించింది ప్రభుత్వం.

గోదావరి వరద ఉధృతికి నష్టం వాటిల్లిన ఏలూరు జిల్లాకు రూ.3 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాకు కోటి రూపాయలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు సర్కార్.

భారీ వర్షాలు, వరదలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. పలు జిల్లాల్లో వానలు బీభత్సం సృష్టించాయి. ఊళ్లకు ఊళ్లు జలదిగ్బంధంలో చిక్కుకుతున్నాయి. ప్రజలు సర్వస్వం కోల్పోయారు. కట్టుబట్టలతో మిగిలారు. ఇక విజయవాడలో బుడమేరు వరద సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. బుడమేరు వాగు దెబ్బకు విజయవాడ నగరం చిగురుటాకులా వణికింది. లక్షల మందిపై ప్రభావం పడింది. ఎంతో మంది సర్వస్వం కోల్పోయారు. వరద నీరు పోటెత్తడంతో ఇళ్లలోని సామాగ్రి మొత్తం కొట్టుకుపోయింది.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. ఇంకా పలు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నడుము లోతు నీటిలోనే ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తినడానికి తిండి లేదు, తాగేందుకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్య అవసరాలు అందించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అటు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో వరద బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

అటు కొల్లేరు వరద ప్రవాహం మరింత పెరిగింది. వరద నీరు రహదారులపైకి వస్తుండటంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ప్రధాన రహదారులపై సైతం వాహన రాకపోకలను నిలిపేశారు. దీంతో లంక గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

 

Also Read : విజయవాడను, లంక గ్రామాలను ముంచాలనే పడవలను వదిలారు : మంత్రి కొల్లు రవీంద్ర

ట్రెండింగ్ వార్తలు