Matsyakarula Sevalo : ఏపీ సర్కార్ శుభవార్త.. ఒక్కో కుటుంబానికి రూ.20 వేలు.. నేడే ఖాతాలో జమ
Matsyakarula Sevalo : ఏపీలోని కూటమి సర్కార్ వారికి శుభవార్త చెప్పింది. ఒక్కో కుటుంబం ఖాతాలో రూ. 20 వేలు జమ చేయనుంది.
- Dharani Pilli
- Updated on- May 19, 2026 / 12:13 PM IST
ap govt release matsyakarula sevalo scheme funds of rs 20000 into fishermen account may 19th
- మత్స్యకార కుటుంబాలకు శుభవార్త
- నేడు మత్స్యకారుల సేవలో నిధులు విడుదల
- ఒక్కో కుటుంబం ఖాతాలో రూ.20 వేలు
Matsyakarula Sevalo : ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వేయడం లేదు. ఈ క్రమంలో తాజాగా నేడు ఒక్కో కుటుంబం ఖాతాలో రూ.20 వేలు జమ చేసేందుకు రెడీ అవుతోంది. ఇంతకీ ఇది ఏ పథకం అంటే.. ‘మత్స్యకారుల సేవలో’. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 1,30,796 మత్స్యకార కుటుంబాలకు ఒక్కో ఇంటికి రూ. 20 వేలు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయనుంది. మరి ఈ ఆర్థిక సాయం ఎందుకంటే.. సముద్రంలో చేపల వేటపై నిషేధం విధించడంతో.. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు గాను ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా వేట నిషేధ భృతిగా ఒక్కో కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో నేడు జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ఈ నిధులను విడుదల చేస్తారు. మత్స్యకారుల సేవలో పథకం కింద మొత్తం లబ్ధిదారుల ఖాతాల్లో రూ.262 కోట్లు జమ చేయనున్నారు.. కావలి మండలం తుమ్మలపెంటలో మంగళవారం ఉదయం 10.45 గంటలకు ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు మాట్లాడతారు. ఆ తర్వాత మధ్యాహ్నం గ్రామంలోని మత్స్యకార కుటుంబాలతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం టీడీపీ శ్రేణులతో సమీక్షలో పాల్గొంటారు.
* ఏపీ ప్రభుత్వం శుభవార్త.. జూన్ 12 నుంచి ఆ 1.53 లక్షల మందికి కొత్త పింఛన్లు
రాష్ట్రంలో మత్స్య సంపద పెంచేందుకు గాను ప్రతి సంవత్సరం.. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజులపాటు సముద్రంలో వేటపై నిషేధం విధిస్తారు. ఈ సమయంలో మత్స్యకారుల జీవనోపాధి కోసం కూటమి ప్రభుత్వం కుటుంబానికి రూ.20 వేల చొప్పున అందిస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు ఏడాదికి రూ.10 వేలు మాత్రమే ఇచ్చింది. గతేడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు సాయం అందించారు. ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్య 1,30,796కి పెరిగింది. రెండేళ్లలో మత్స్యకారుల కుటుంబాలకు రూ.505 కోట్లు సాయంగా అందించింది.
