AP Heatwaves: ఏపీపై భానుడి ప్రతాపం.. 3 రోజులు అగ్నిగుండంలా రాష్ట్రం.. ఆ సమయంలో బయటకు రావొద్దు..
47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 88 మండలాల్లో వడగాల్పుల హెచ్చరిక జారీ చేసింది. ఎల్లుండి 177 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించింది.
AP Heatwaves: ఏపీలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. తీవ్రమైన ఎండలతో జనం విలవిలలాడిపోతున్నారు. ఇది చాలదన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఎండల ఎఫెక్ట్ తీవ్రంగా ఉండనుందని, రానున్న మూడు రోజులు రాష్ట్రం అగ్నిగుండంలా మారనుందని తెలిపింది. కోస్తాంధ్ర జిల్లాల్లో ఆదివారం వరకు ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించింది. మే 20, 21 తేదీల్లో పలు చోట్ల 45°C నుంచి 47°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 88 మండలాల్లో వడగాల్పుల హెచ్చరిక జారీ చేసింది. ఎల్లుండి 177 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 46°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయి. గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో టెంపరేచర్లు 44°C దాటే అవకాశం ఉంది.
తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావొద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచన చేసింది. అత్యవసరం అయితేనే బయటకు రావాలంది. అది కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. తలకు టోపీ పెట్టుకోవడం, గొడుగు వాడటం వంటి జాగ్రత్తలు పాటించాలని చెప్పింది.
ఇక వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంది. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలని చెప్పింది. అకాల వర్షాలు, పిడుగుల ముప్పు కూడా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పొలాల్లో పని చేసే వారు, పశుకాపరులు చెట్ల కింద నిలబడొద్దని సూచన చేసింది. ఎండలు, పిడుగుల వర్షాలకు సంబంధించి ప్రజలకు ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరిక సందేశాలు పంపుతున్నామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
ఇక, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో ఇవాళ రాష్ట్రంలోనే అత్యధికంగా 44.3°C నమోదైంది. కడపలో 42.9°C, తిరుపతి రాయలచెరువులో 42.8°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Also Read: యూరియా కోసం రైతులకు ప్రత్యేక కార్డులు- మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన
