Mumbai Actress Case : ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో పోలీసు అధికారులపై వేటు పడింది. ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీని సస్పెండ్ చేసింది సర్కార్. ఇప్పటికే ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల సత్యనారాయణ, అప్పటి విజయవాడ వెస్ట్ ఏసీపీగా పని చేసిన హనుమంతరావుపై సస్పెన్షన్ విధిస్తూ డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు.
Also Read : ఇన్నాళ్లూ తనతో ఆడుకున్న ప్రత్యర్థులపై రోజా వేట స్టార్ట్ చేశారా?
జెత్వానీ కేసులో ఏపీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఎస్ హెచ్ఓగా పని చేసిన ముత్యాల సత్యనారాయణ, విజయవాడ వెస్ట్ ఏసీపీని సస్పెండ్ చేస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
అయితే పాత్రధారులు, సూత్రధారులను వదిలేసి మాపై వేటు వేయడం ఏంటని కిందస్థాయి సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నటి కేసులో పూర్తి స్థాయి విచారణ చేసిన విజయవాడ పోలీసులు.. దీనికి సంబంధించిన నివేదికను డీజీపీకి ఇచ్చారు. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదికను ఇచ్చారు డీజీపీ. అనంతరం ఏపీ డీజీపీ ద్వారకాతిరుమలరావుతో డిస్కస్ చేసింది ప్రభుత్వం. అనంతరం ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటు వేసింది. జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ గా పని చేసిన కాంతిరాణా టాటా, డీసీపీగా పని చేసిన విశాల్ గున్నిలపై వేటు పడింది.
మొత్తంగా ముంబై నటికి వేధింపుల కేసును సీరియస్ గా తీసుకుంది చంద్రబాబు సర్కార్. ఇందులో బాధ్యులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ముందు ముందు ఇంకా ఎవరెవరిపై చర్యలు ఉంటాయో అనే టెన్షన్ పోలీసు అధికారుల్లో నెలకొంది.