కువైట్ ఎడారిలో చిక్కుకున్న వ్యక్తిని గుర్తించిన ఏపీ ప్రభుత్వం.. వెనక్కి రప్పించేందుకు మంత్రి నారా లోకేశ్ ప్రయత్నాలు

మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశాడు ఏజెంట్. ఎడారిలో పశువులు కాసే పనిలో నియమించాడు.

Telugu Man Stuck In Kuwait

Telugu Man Stuck In Kuwait : కువైట్ ఎడారిలో కష్టాలు పడుతున్న వ్యక్తిని ఏపీ ప్రభుత్వం గుర్తించింది. బాధితుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా వాయల్పాడు మండలం చింతపర్తికి చెందిన శివగా గుర్తించింది. అతడిని రప్పించేందుకు మంత్రి నారా లోకేశ్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే కువైట్ లోని భారత ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరిపారు. రెండు రోజుల్లో శివను స్వగ్రామానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. శివ 2 నెలల క్రితమే బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లాడు.

మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశాడు ఏజెంట్. ఎడారిలో పశువులు కాసే పనిలో నియమించాడు. దీంతో శివ తన బాధలను వివరిస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఎడారిలో నీరు, ఆహారం లేక మూడు రోజులుగా నరకయాతన అనుభవిస్తున్నాని వాపోయాడు. శివకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో ఏపీ ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. బాధితుడిని గుర్తించిన ప్రభుత్వం అతడిని స్వగ్రామం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

ఎడారి దేశంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలుగు వ్యక్తి శివను తిరిగి స్వగ్రామం రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన శివ సెల్ఫీ వీడియో వైరల్ అయ్యింది. ఎడారిలో పని చేస్తూ.. కనీసం నీరు, తిండి లేక.. చుట్టూ మనుషులే కనిపించక, చెట్టు చేమ కనిపించక.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆ వ్యక్తి వాపోయాడు. మరో రెండు రోజులు ఇలానే ఉంటా తాను ఆత్మహత్య చేసుకోవడం తప్ప తనకు మరో దారి లేదని కన్నీరుమున్నీరు అయ్యాడు. మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఎడారిలో వదిలేశారని, పశువులకు ఆహారం పెట్టే అతి హీనమైన, అతి కష్టమైన పనిని మండుటెండల్లో చేస్తున్నట్లు బాధితుడు వీడియోలో వాపోయాడు.

Also Read : విశాఖ వైసీపీ విలవిల.. ఎక్కడా కనిపించని వైసీపీ నేతలు

తాను పడుతున్న కష్టాలను, నరకయాతనను ఆ వీడియోలో చెప్పాడు. అయితే దురదృష్టం ఏంటంటే.. ఆ వ్యక్తి తన పేరు కానీ, ఎక్కడి నుంచి వచ్చాడు, కుటుంబసభ్యులు ఎవరు, ఎప్పుడు వచ్చాడు.. ఇలాంటి వివరాలు ఏవీ అతడు వీడియోలో చెప్పలేదు. వీడియో బాగా వైరల్ అయ్యంది కానీ, ఆ వ్యక్తి ఎవరు అనే వివరాలు మాత్రం తెలియకుండా పోయాయి. అతడి వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా వైరల్ అయిపోయింది. చివరికి అతడిని గుర్తించగలిగారు. అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం చింతపర్తి గ్రామానికి చెందిన శివగా గుర్తించారు. బీసీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. శివకు భార్య శంకరమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు