AP Rains
AP Rains : ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే మరో రెండు మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. కుండపోత వర్షాలు కురిసే చాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
దక్షిణ ఒడిశా నుంచి కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని (AP Rains) పలు ప్రాంతాల్లో వచ్చే 24గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Also Read: TTD Coverts: టీటీడీలో లీకు వీరులు? పాలకమండలి నిర్ణయాలు, రహస్యాలు ముందే బయటపెడుతున్న కోవర్టులెవరు?
క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటం వల్ల పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో కూడా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ కారణంగా అల్లూరి సీతారామరాజు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఏపీలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు చోట్ల గురువారం వర్షం కురిసింది. తిరుపతి జిల్లా పూలతోటలో 6.8 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు కాగా.. హస్తకావేరిలో 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే, ఈనెల 16,17 తేదీల్లో నైరుతి రుతుపవనాలు దేశం నుంచి నిష్ర్కమించి, అదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారతంలోకి ప్రవేశిస్తాయని, ఈ కారణంగా వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.