YS Jagan
YS Jagan : ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీసుకొచ్చిన రూలింగ్‌ను సవాల్ చేస్తూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్ పై కోర్టులో బుధవారం విచారణ జరిగింది. పిటిషన్ ఆధారంగా ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ముందే నిర్ణయించారని జగన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. స్పీకర్ రూలింగ్ వెనుక రాజకీయ వైరం, పక్షపాతం ఉన్నాయని, ఇది స్పీకర్ ఒక్కరి నిర్ణయమే కాదని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత గురించి రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అలాగే చట్టంలో కూడా స్పష్టమైన నిర్వచనం ఉంది. సీట్ల ఆధారంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడా లేదని, అయినా, చట్టంలో లేని పరిమితిని స్పీకర్ తన రూలింగ్ లో నిర్దేశించారని, ప్రతిపక్షాన్ని అణచివేయడమే స్పీకర్ రూలింగ్ లక్ష్యంగా కనిపిస్తోందని జగన్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ జీత భత్యాలు, పెన్షన్లు, అనర్హతల తొలగింపు చట్టానికి విరుద్ధంగా రూలింగ్ ను ప్రకటించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ తన పిటిషన్ ఇంకా హైకోర్టులో పెండింగ్ లో ఉండగానే .. తన విజ్ఞప్తిని తిరస్కరిస్తూ స్పీకర్ రూలింగ్ ఇచ్చారని పిటిషన్ లో జగన్ ప్రస్తావించారు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం, నాకు ప్రతిపక్ష నేత హోదా ప్రకటించేలా స్పీకర్ ను ఆదేశించాలని జగన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు
జగన్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. పిటిషన్ ఆధారంగా ప్రతివాదులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.