AP Cinema Tickets Rates : ఏపీలో సినిమా టికెట్ రేట్లపై హైకోర్టు కీలక తీర్పు!

ఏపీలో సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. పాత విధానంలోనే సినిమా టికెట్ల ధరలను నిర్ణయించే వెసులుబాటు కల్పించింది.

AP Cinema Tickets Rates : ఏపీలో సినిమా టికెట్లు ధరలు తగ్గిస్తూ సర్కారు ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. పాత విధానంలోనే సినిమా టికెట్ల ధరలను నిర్ణయించేందుకు వెసులుబాటు కల్పించింది. సినిమా టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కూడా డిస్ట్రిబ్యూటర్లకు హైకోర్టు ఇచ్చింది.

సినిమా టికెట్ల ధరలు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ థియేటర్ల యాజమాన్యాల తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరుపక్షాల మధ్య వాదనలను కోర్టుకు విన్నవించారు న్యాయవాదులు. థియేటర్ల యాజమాన్యాల తరపున సీనియర్ లాయర్లు ఆదినారాయణ రావు, దుర్గప్రసాద్ హైకోర్టుకు వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వ జీవో ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు.

సినిమా విడుదలపై టికెట్ల రేట్లు పెంచుకునే హక్కు థియేటర్ల యాజమాన్యాలకు ఉంటుందని లాయర్లు కోర్టుకు తెలిపారు. అన్ని సినిమా టికెట్ రేట్లు ఒకేవిధంగా ఉండాలని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అయితే టికెట్ల ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టుకు విన్నవించిన పిటిషనర్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. సినిమా టికెట్ల ధరలపై జీవో నెంబర్ 35ని హైకోర్టు సస్పెండ్ చేసింది. హైకోర్టు కీలక తీర్పు నేపథ్యంలో.. పుష్ప మూవీ రిలీజ్‌కు ముందు టాలీవుడ్ బిగ్ రిలీఫ్ కలిగింది. ఏపీలో సినిమా టికెట్ రేట్లు పెంచుకునేలా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొత్త సినిమాలు రిలీజ్ సమయంలో టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది.

మున్సిపల్ కార్పొరేషన్లలో టికెట్ల ధరలు :
ఏపీలో సినిమా టికెట్లపై ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు ఇలా ఉన్నాయి.. మున్సిపల్ కార్పొరేషన్లలో ఏసీ ప్రీమియం రూ.100 ఉండగా.. డీలక్స్ రూ.60 వరకు ఉంది. ఎకానమీ రూ. 40 వరకు రేట్లను నిర్ణయించింది. నాన్ ఏసీ ప్రీమియం రూ.60 ఉండగా.. డీలక్స్ రూ.40, ఎకానమీ రూ. 20 వరకు నిర్ణయించింది ప్రభుత్వం. అలాగే మల్టీ ఫ్లెక్సుల్లో ప్రీమియం రూ.150 ఉండగా.. డీలక్స్ రూ.100, ఎకానమీ రూ. 60 వరకు ఉన్నాయి. ఏసీ ప్రీమియం రూ.70 ఉండగా.. డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30వరకు రేట్లను నిర్ణయించింది.

నగర పంచాయతీల్లో టికెట్ల ధరలు :
మల్టీప్లెక్స్ ప్రీమియం రూ. 120
డీలక్స్ రూ.80, ఎకానమీ రూ. 40
ఏసీ ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15
నాన్ ఏసీ ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10

గ్రామ పంచాయతీల్లో టికెట్ల ధరలు :
మల్టీప్లెక్స్ ప్రీమియం రూ. 80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ. 30
ఏసీ ప్రీమియం రూ.20, డీలక్స్ రూ. 15, ఎకానమీ రూ.10
నాన్ ఏసీ ప్రీమియం రూ. 15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5

Read Also : Online Cinema Tickets : ఏపీ ప్రభుత్వం తగిన న్యాయం చేయాలి : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు

ట్రెండింగ్ వార్తలు