Ap Inter And Tenth Students To Wait For Cm Jagan Decision On Exams
AP Inter-Tenth Students : ఏపీలో ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వాహణ విషయంలో కొన్నాళ్లుగా సందిగ్ధం కొనసాగుతోంది. పరీక్షల నిర్వహణపై నెలకొన్న గందరగోళానికి గురువారం (జూన్ 17)న తెరపడే అవకాశాలు ఉన్నాయా? విద్యార్ధులు కోరుకున్నది జరుగుతుందా.. ? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం సీఎం ప్రకటించబోయే నిర్ణయంతో తేలిపోనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ అధికారులతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించబోతున్నారు.
నాడు.. నేడు కార్యక్రమంతోపాటు, వచ్చే విద్యాసంవత్సరం నుంచి చేపట్టనున్న నూతన విధనాలు, పరీక్షల నిర్వాహణ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వాహణకు సంబంధించి ఇప్పటికే కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా విద్యాశాఖ ఒక షెడ్యూల్ ను రూపొందించింది. ఈ ప్రతిపాదనను అధికారులు సీఎం జగన్ ముందు ఉంచనున్నారు.
దీనిపై ఆయన తుదినిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే విద్యావేత్తుల, విద్యార్ధుల తల్లిదండ్రుల నుండి పరీక్షలను రద్దు చేయాలన్న విన్నపాలు ప్రభుత్వానికి అందాయి. అయితే జాతీయస్ధాయి విద్యావిధానంతో రాష్ట్రంలోని విద్యావిధానం ముడిపడి ఉంది.
ఇప్పటికే మిగిలిన రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు చేసి కొత్త విద్యాసంవత్సరానికి సిద్ధమౌతుండటంతో పరీక్షల పేరుతో కాలయాపన చేస్తే విద్యార్ధుల భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుందన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమౌతుంది. ఈ క్రమంలో సీఎం జగన్ జరగబోయే సమావేశంలో విద్యార్ధుల భవిష్యత్తు దృష్ట్యా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారా అని ఉపాధ్యాయులు, విద్యార్ధులు , వారి తల్లిదండ్రులంతా ఉత్కంఠగా వేచిచూస్తున్నారు.