Bopparaju venkateswarlu : ఉద్యమ కార్యాచరణపై వెనక్కి తగ్గేది లేదు.. మాపై అన్యాయంగా అపవాదు సరికాదు..
Bopparaju venkateswarlu : ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తాము ప్రకటించిన ఉద్యమ కార్యాచరణను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకునేది లేదని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
- Harish Thanniru
- Published on- August 30, 2026 / 01:41 PM IST
Bopparaju venkateswarlu
Bopparaju venkateswarlu : ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తాము ప్రకటించిన ఉద్యమ కార్యాచరణను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకునేది లేదని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తమ ఉద్యమాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేయడం తమ హక్కు అని పేర్కొన్నారు.
Also Read : Visakhapatnam YCP : గ్రేటర్ విశాఖలో ఫ్యాన్ స్పీడ్‌ను పెంచేదెవరు.? మేయర్ సీటు దక్కేదెలా..
ఈనెల 28న నిర్వహించిన సదస్సులో ఉద్యమ కార్యాచరణను ప్రకటించామని బొప్పరాజు తెలిపారు. సామరస్యంగా జరుగుతున్న చర్చలకు తాము విఘాతం కలిగించామని, సీఎం చంద్రబాబును అవమానించేలా కుట్రపూరితంగా వ్యవహరించామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ప్రభుత్వం ఏర్పడి మూడో సంవత్సరం అవుతుంది. మాకు రావాల్సిన డబ్బులు, మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలనే అడుగుతున్నాం. ప్రభుత్వం కాలయాపన చేసినంతకాలం ఓపిగ్గా ఉన్నాం. ఉద్యమం వైపు వెళ్తున్న సమయంలో మమ్మల్ని చర్చలకు పిలిచారని బొప్పరాజు పేర్కొన్నారు.
ఐదుగురు మంత్రులు, పది మంది ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ తమతో చర్చలు జరిపిందని, అయితే 40 రోజులుగా చర్చించిన అంశాల్లో ఇప్పటివరకు ఎలాంటి అమలు జరగలేదని అన్నారు. అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా స్పందన రాకపోవడంతోనే సదస్సులో తమ డిమాండ్లు, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రస్తావించామని తెలిపారు.
తమ ఉద్యమానికి రాజకీయ ఉద్దేశాలు ఆపాదించడం సరికాదని బొప్పరాజు అన్నారు. మా ఎజెండా రాజకీయాలు కాదు.. ఉద్యోగుల ఎజెండా. మాకు రాజకీయాలతో పనిలేదు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడమే ముఖ్యమని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ ఉద్యోగుల సమస్యలపై పోరాడామని, తమ ఉద్యమం ద్వారా 39 జీవోలు సాధించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన చెల్లింపులకు తాము ధన్యవాదాలు కూడా తెలిపామని గుర్తుచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో జరిగిన సభలో చంద్రబాబు ప్రభుత్వాన్ని అభినందించామని తెలిపారు.
ఎంప్లాయీస్ హెల్త్ కార్డు సమస్యను కమిటీకి అప్పగించడంతో సరిపెట్టారని, అప్పటి నుంచి సమస్యను ఎందుకు పరిష్కరించలేదని అన్నారు. ఉద్యోగులకు వైద్య ఖర్చుల బిల్లులు కూడా మంజూరు కావడం లేదని ఆరోపించారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదని బొప్పరాజు తెలిపారు. ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వైద్యం, విద్య కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
అరకొర జీతాలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితిని ఆలోచించరా? పీఆర్సీ విధానం అంటే పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా జీతాలు పెంచడం కాదా? ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేంద్రం డీఏలు ఇస్తోంది. మాకు మాత్రం డీఏలు ఇవ్వరు, సమస్యలు పరిష్కరించరు. మాకు న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బులు ఇవ్వాలి. వేల కోట్ల రూపాయల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం ప్రకటించాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. మీరు ఎన్ని డైవర్షన్‌లు చేసినా మా కార్యాచరణ ఆగదని బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చిచెప్పారు.
