AP Land Registration Charges Hike
AP Land Registration Charges : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల కొత్త రిజిస్ట్రేషన్ ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువల్లో మార్పులు, చేర్పులు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, కొన్ని ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచగా.. మరికొన్ని ప్రాంతాల్లో తగ్గించారు. ఇంకొన్ని ప్రాంతాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. రాష్ట్రంలోని అధిక శాతం ప్రాంతాల్లో సగటున 20శాతం రిజిస్ట్రేషన్ విలువ పెరిగింది. నివాస స్థలాలు, వాణిజ్యంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల ప్రాతిపదికన విలువను సవరించారు.
విజయవాడలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు మూడు నుంచి తొమ్మిది శాతం వరకు పెరిగాయి. విశాఖపట్టణంలోని పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి. అయితే, గుంటూరు జిల్లాలో కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్ విలువ తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గుంటూరు శివారు నల్లపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఎకరా పొలం రిజిస్ట్రేషన్ విలువ రూ.1.96 కోట్లు ఉండగా.. దాన్ని రూ.30లక్షలు తగ్గించారు. అదేవిధంగా సుద్దపల్లి డొంకలో ఎకరా పొలం రూ.4.35 కోట్లు ఉండగా.. రూ. 1.99 కోట్లకు తగ్గించారు. అనకాపల్లి పట్టణంలో రిజిస్ట్రేషన్ విలువలో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే, అనకాపల్లి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి.
Also Read: TDP Politburo : కడపలో మహానాడు..- టీడీపీ పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయం
ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్న నేపథ్యంలో శుక్రవారం పలు ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి. విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి 11గంటల వరకు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలిసింది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే 14,250 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. రోజుకు 70 రిజిస్ట్రేషన్లు నుంచి 80 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో దాదాపు 170 వరకు జరిగాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1,184 రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీంతో నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ. 107 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం.