శాసనమండలి రద్దు అవుతుందా ? కాదా ? అనే ఉత్కంఠ వీడడం లేదు. 2020, జనవరి 21వ తేదీ ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలిలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచించింది. కానీ అనూహ్యంగా రూల్ 71ని టీడీపీ ప్రవేశపెట్టడంతో మండలిని రద్దు చేయడమే బెటర్ అని భావిస్తున్నారు సీఎం జగన్. కానీ ఓ సెంటిమెంట్ ఉండడంతో తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది.
ఏంటా సెంటిమెంట్
1958లో ఆర్టికల్ 168 కింద జులై 01న మండలి ఫస్ట్ టైం ఏర్పాటైన సంగతి తెలిసిందే కదా. కానీ…తర్వాత క్రమంలో…1985 ఏప్రిల్ 30వ తేదీన మండలిని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేసింది ఎన్టీఆర్ ప్రభుత్వం. తర్వాత..మండలి కోసం 1990 జనవరి 22వ తేదీన అసెంబ్లీలో తీర్మానం చేసింది మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం. కానీ 1991 సంవత్సరంలో లోక్ సభ రద్దు కావడంతో ఇది మరుగున పడిపోయింది.
2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మండలిని జగన్ తండ్రి దివంగత రాజశేఖరరెడ్డి పునరుద్ధరించారు. 2005, డిసెంబర్ 15వ తేదీన ఏపీ శాసనమండలి పునరుద్ధరణకు లోక్ సభ ఆమోదం తెలిపింది. 2005, డిసెంబర్ 20వ తేదీన రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. 2006, జనవరి 10వ తేదీన ఏపీ శాసనమండలి పునరుద్ధరణకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. 2007 మార్చి 30వ తేదీన ఏపీ శాసనమండలి మరలా ఏర్పాటైంది.
ప్రస్తుతం పరిస్థితుల్లో తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సెంటిమెంట్ కోసమైనా..మండలిని జగన్ రద్దు చేయరనే చర్చ జరుగుతోంది. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
Read More : పాలన రాజధాని తరలింపుకు ముహూర్తం ఫిక్స్!