ఏపీలో స్థానిక సంగ్రామం : నామినేషన్ల ప్రక్రియ షురూ

  • Publish Date - March 9, 2020 / 12:34 AM IST

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. వైసీపీ, టీడీపీ, జనసేన మూడు ప్రధాన పార్టీలూ స్థానిక సమరానికి సిద్ధమవుతున్నాయి. క్షేత్ర స్థాయిలో తమకు బలం లేదని తెలిసినా.. బీజేపీ కూడా జనసేనతో కలిసి.. లోకల్ వార్‌కు సై అంటోంది. దీనికోసం కేడర్‌ను అన్ని పార్టీలూ సిద్ధం చేశాయి. రాష్ట్రంలో మూడు రకాల స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ ఇప్పటికే విడుదల అయ్యాయి. మూడు దశల్లో లోకల్ ఎలక్షన్స్ నిర్వహించనున్నారు. 

నామినేషన్ల ప్రక్రియ : –
2020, మార్చి 09వ తేదీ సోమవారం నుంచి ఈనెల 11 వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.. ఎంపీటీసీ స్థానాలకు సంబంధిత మండల పరిషత్‌ కార్యాలయంలో.. జెడ్పీటీసీ స్థానాలకు జిల్లా పరిషత్‌ సీఈఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 660 జెడ్పీటీసీ స్థానాలకు.. 9 వేల 984 ఎంపీటీసీ స్థానాలకు ఈనెల 21వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కౌంటింగ్ ఈనెల 24న జరగనుంది. 

పట్టణ, నగర పాలక సంస్థలకు : –
ఇక పట్టణ, నగర పాలక సంస్థలకు కూడా ఒకే విడతలో ఈ నెల 23న ఎన్నికలు జరుగుతాయి. ఇందుకు 11 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. ఈనెల 23న పోలింగ్ నిర్వహించి…  27న లెక్కింపు చేపడతారు.  మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్‌ చైర్మన్, వైఎస్‌ చైర్మన్‌ ఎన్నిక ఎక్కడికక్కడ ఈ నెల 31న జరుగుతుంది.

రెండు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు : –
ఇక రెండు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు 17 నుంచి 19 తేదీల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. రెండో విడతలో జరిగే వాటికి 19 నుంచి 21 తేదీల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. ఇటీవల పలు పంచాయతీలను మున్సిపాలిటీలలో విలీనం అనంతరం రాష్ట్రంలో దాదాపు 13 వేల 377 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

సిద్ధమైన పార్టీలు : –
తొలి దశ, రెండో దశలో ఏయే  గ్రామాలకు ఎన్నికలు నిర్వహించాలన్న దానిపై పూర్తి అధికారాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆయా జిల్లా కలెక్టర్లకే అప్పగించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పొలింగ్‌ నిర్వహిస్తారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్‌ చేపడతారు. మొత్తానికి స్థానిక సంస్థల నగరా మోగడంతో.. అన్ని పార్టీలూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి..