MPTC ZPTC Elections Notification: మైదుకూరులో మున్సిపల్ ఎన్నికలు వాయిదా..! ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
AP MPTC ZPTC Elections Notification : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది.
- Harish Thanniru
- Updated on- October 19, 2026 / 12:43 PM IST
AP Local Body Elections 2026 SEC Notification MPTC ZPTC Poll
AP MPTC ZPTC Elections Notification 2026 : ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగా.. అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. అయితే, తాజాగా.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది.
Also Read : AP Local Body Elections : ఏపీ హైకోర్టులో వైసీపీ పిటిషన్ కొట్టివేత.. నామినేషన్ల గడువు పెంపునకు నో!
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీత సోమవారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లా పరిషత్లు, 659 జడ్పీటీసీ, 659 ఎంపీపీ, 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. మొత్తం 2,81,34, 518 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా, నవంబర్ 3న పోలింగ్ జరుగుతుందని తెలిపారు.
అక్టోబర్ 21న రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ప్రకటనలు జారీ చేస్తారని, అదేరోజు నుంచి అక్టోబర్ 23 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్ పత్రాల పరిశీలన అక్టోబర్ 24న జరుగుతుంది. తిరస్కరణకు గురైన నామినేషన్లపై అక్టోబర్ 25న అప్పీళ్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ అప్పీళ్లను అక్టోబర్ 26న పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అక్టోబర్ 27న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువుగా ప్రకటించారు. ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం అదేరోజు బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. దీంతో ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులపై స్పష్టత రానుంది.
నవంబర్ 3న జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అవసరమైన ప్రాంతాల్లో నవంబర్ 4న రీపోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలతో పట్టణాల్లో రాజకీయ వాతావరణ హీటెక్కగా.. ఈ ఎన్నికలతో రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల్లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కనుంది.
ముఖ్యమైన తేదీలు ఇవే..
♦ అక్టోబర్ 21 : నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
♦ అక్టోబర్ 21, 22, 23 తేదీల్లో : నామినేషన్ల స్వీకరణ
♦ అక్టోబర్ 24: నామినేషన్ల పరిశీలన
♦ అక్టోబర్ 25: అప్పీళ్ల దాఖలు
♦ అక్టోబర్ 26: అప్పీళ్ల పరిష్కారం
♦ అక్టోబర్ 27: నామినేషన్ల ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా
♦ నవంబర్ 3 : పోలింగ్
♦ నవంబర్ 4: అవసరమైన చోట రీపోలింగ్
♦ నవంబర్ 5: ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన
మైదుకూరులో మున్సిపల్ ఎన్నికలు వాయిదా..
వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులో మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా ప్రకటించారు. నామినేషన్ పత్రాలను చంచివేసినందున వాటి పరిశీలన కష్టమని, ఈ నేపథ్యంలో అక్కడ మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. అక్కడ ఎన్నికల ప్రక్రియకు మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు.
