Chandrababu Naidu : రూ.500 నోట్లు రద్దు చేయాలి.. ఆ రెండు నోట్లు చాలు..! డిజిటల్ కరెన్సీపై చంద్రబాబు అసక్తికర వ్యాఖ్యలు..
Chandrababu Naidu : డిజిటల్ కరెన్సీ ఐడియా నేనే ఇచ్చాను. అవినీతిని నిర్మూలించాలంటే డిజిటల్ కరెన్సీని ప్రమోట్ చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు.
Chandrababu Naidu
Chandrababu Naidu : అవినీతిని నిర్మూలించాలంటే డిజిటల్ కరెన్సీని ప్రమోట్ చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. డిజిటల్ కరెన్సీ ఐడియా నేనే ఇచ్చాను. రూ.500, రూ.1000, రూ.2000 నోట్లు రద్దై పోవాలి. రూ.100, రూ.200 నోట్లు మాత్రమే ఉండాలి. ఈ మేరకు ప్రధానిని డిమాండ్ చేస్తూనే ఉంటా. టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించుకుంటే సంపద సృష్టించడం, పేదరికాన్ని నిర్మూలించడం కష్టమేమీ కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వ్యవస్థల్లోని లోపాలను సరిదిద్ది అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు.
మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించడంపై సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో జనాభా ప్రాతిపదికన రాజకీయాల్లో భాగస్వామ్యంపై అధ్యయనం చేశామని చంద్రబాబు తెలిపారు. ఏ సామాజిక వర్గం జనాభా ఎంత ఉంది? వారికి తగిన ప్రాతినిధ్యం ఎలా కల్పించాలి? అనే అంశాలపై కసరత్తు చేశామని చెప్పారు. అన్ని కులాలు, వర్గాలకు తగిన సహకారం అందించడమే తమ లక్ష్యమన్నారు.
సంపద సృష్టించడం అంటే కేవలం ధనవంతుల కోసం పనిచేయడం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. సంపద సృష్టించినప్పుడే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని, ఆ ఆదాయంతో పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు పేదరికాన్ని తగ్గించవచ్చని వివరించారు. అదే సమయంలో సమాజంలో ఆర్థిక అసమానతలు క్రమంగా తగ్గాలని అభిప్రాయపడ్డారు. కొందరు అపారమైన సంపద కలిగి ఉండగా, పేదలకు కనీసం మూడు పూటలా భోజనం దొరకని పరిస్థితి ఉంటే అది ఆరోగ్యకరమైన సమాజం కాదన్నారు. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి కొత్త రాజకీయ విధానానికి శ్రీకారం చుట్టిందని చంద్రబాబు చెప్పారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ కార్యకర్తల బలంతో పనిచేసే పార్టీ అని, పార్టీ జెండాను ప్రాణం కంటే ఎక్కువగా భావించే నిబద్ధత కలిగిన కార్యకర్తలు ఉన్నారని అన్నారు. అయితే ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేసి ఓట్లు పొందే విధానానికి బదులుగా సేవాభావంతో ప్రజలకు దగ్గరయ్యే రాజకీయాలను ప్రోత్సహించాలని నిర్ణయించామని తెలిపారు. ఎన్నికల్లో డబ్బులు పంచడం సరైన విధానం కాదని, ఈ ఎన్నికల్లో ఆ విధానాన్ని చాలావరకు నియంత్రించగలిగామని చెప్పారు.
అభ్యర్థులు ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు చేస్తే, గెలిచిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి సంపాదించుకోవాలనే ఆలోచనకు అవకాశం ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఖర్చు తగ్గితే నాయకుల్లో ప్రజల పట్ల జవాబుదారీతనం పెరుగుతుందని, అవినీతిని నియంత్రించేందుకు కూడా అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు.
తుఫాన్ల నిర్వహణ, రైతులకు భరోసా, ఎన్నికల సంస్కరణలు, సంపద సృష్టి, సామాజిక న్యాయం.. ఇలా వివిధ రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు.
