Chandrababu Naidu : స్థానిక ఎన్నికల్లో కూటమి అఖండ విజయానికి కారణాలివే.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన సీఎం చంద్రబాబు
Chandrababu Naidu : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
Chandrababu Naidu
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి మరోసారి అఖండ విజయాన్ని అందించారని పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజల మద్దతు మరింత పెరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజలు కూటమి అభ్యర్థులకే పట్టం కట్టారని తెలిపారు. ఈ విజయం రెండున్నరేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన ఆమోదమని అభివర్ణించారు.
Also Read : Jensen Huang Affair : ఎన్విడియా బాస్‌తో చైనా మహిళ ఎఫైర్.. 4.8 బిలియన్ డాలర్ల చిప్ డీల్ వెనుక అసలేం జరిగింది?
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘గుడ్ గవర్నెన్స్ లీడ్స్ టు గుడ్ పాలిటిక్స్’ (సుపరిపాలనతోనే మంచి రాజకీయాలు సాధ్యమవుతాయి) అని తాను నిరంతరం విశ్వసిస్తానని చెప్పారు. ఎన్నికల్లో కూటమికి అఖండ విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలం మరింత పెరిగిందని చంద్రబాబు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి మొత్తంగా 58.9 శాతం ఓట్లను సాధించిందన్నారు. 2024 ఎన్నికల్లో ఈ ఓట్ల శాతం 55.3గా ఉందని తెలిపారు. అంటే గత ఎన్నికలతో పోలిస్తే కూటమికి 3.6 శాతం ఓట్లు పెరిగాయని వెల్లడించారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో 33.56 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని చెప్పారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి 39.81 శాతం ఓట్లు వచ్చాయని గుర్తుచేశారు. గత ఎన్నికలతో పోలిస్తే వైసీపీ ఓట్ల శాతం 6.25 తగ్గిందన్నారు. మొత్తంగా కూటమికి, వైసీపీకి మధ్య ఓట్ల శాతంలో 25.34 శాతం వ్యత్యాసం ఉందని వివరించారు.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 59.9 శాతం ఓట్లు రాగా, వైసీపీకి 34.3 శాతం ఓట్లు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. పట్టణాల్లో కూటమి స్ట్రైక్ రేట్ 94 శాతంగా ఉందన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమికి 57.6 శాతం, వైసీపీకి 39.7 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో కూటమి స్ట్రైక్ రేట్ 87.5 శాతంగా నమోదైందన్నారు. పట్టణ ప్రాంతాల్లో కూటమికి, వైసీపీకి మధ్య 25.60 శాతం ఓట్ల వ్యత్యాసం ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యత్యాసం 17.9 శాతంగా ఉందని వెల్లడించారు. వర్గాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆలోచనా విధానం ఒకేలా ఉందని, ఫలితాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన పరాజయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు కీలక వివరాలు వెల్లడించారు. ఏడు జిల్లాల్లో వైసీపీకి ఒక్క జెడ్పీటీసీ స్థానం కూడా దక్కలేదన్నారు. అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, మార్కాపురం, పల్నాడు, పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో వైసీపీ ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిందని తెలిపారు. ఎన్నికల్లో ఈవీఎంలు, బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ బ్యాలెట్లు అనే తేడా లేకుండా ప్రజలు కూటమికి మద్దతు తెలిపారని చంద్రబాబు పేర్కొన్నారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూటమికి ఘన విజయాన్ని అందించడం ద్వారా.. రెండున్నరేళ్ల అభివృద్ధికి ప్రజలు స్పష్టమైన ఆమోదాన్ని తెలిపారని చంద్రబాబు పేర్కొన్నారు.
