రాజధానిపై మంత్రి కొడాలి కీలక వ్యాఖ్యలు…టీడీపీ నేతల ఉద్యమాలు కూడా ఆపలేవు

రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల్లో తప్పులేదని మంత్రి కొడాలి నాని అన్నారు. ఇవాళ సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని పేరిట రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు దోచుకున్నారని.. తాము చేసిన అక్రమాలు బయట పడతాయనే టీడీపీ నాయకులు గోల చేస్తున్నారని నాని ఆరోపించారు.

రాజధానిని మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న ఆయన.. ఒకవేళ ప్రభుత్వం మార్చాలనుకుంటే టీడీపీ నేతలు ఉద్యమాలు ఆపగలవా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై మంత్రివర్గ ఉపసంఘం విచారిస్తోందని, నివేదిక అందాక అక్రమార్కులపై చర్యలు ఉంటాయన్నారు. ప్రభుత్వ ఖజానాను దోచుకున్న దొంగలెవరైనా జైలుకు వెళ్లక తప్పదని నాని అన్నారు.

పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ వ్యవహారంపై హైకోర్టు స్టే తాత్కాలికమేనని నాని అన్నారు. న్యాయపరంగానే ఈ వ్యవహారాన్ని ఎదుర్కొంటామన్నారు. అవినీతి అక్రమాలు నివారించి ప్రభుత్వ ధనాన్ని కాపాడటమే లక్ష్యంగా సీఎం జగన్ రివర్స్‌ టెండరింగ్‌  విధానాన్ని తీసుకువచ్చారని.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. రివర్స్ టెండరింగ్‌పై ప్రభుత్వ విధానాలను హైకోర్టు ఎక్కడా తప్పు పట్టలేదన్నారు. ఈ అంశంలో సీఎం జగన్ అడుగులు ముందుకే కానీ వెనక్కి ఉండవన్నారు.