Polavaram : పోలవరం డీపీఆర్‌ 2 అంశాలపై నేడు ఢిల్లీలో సమావేశం

పోలవరం ప్రాజెక్టులో 2017-18 ధరలకు సంబంధించిన డీపీఆర్‌ 2 అంశాలను కొలిక్కి తెచ్చేందుకు ఢిల్లీలో సమావేశం కానున్నారు. కొత్త డీపీఆర్‌ ఆమోదం విషయం నెలల తరబడి కేంద్రంలో పెండింగులో ఉంది. కొత్త ధరలు ఆమోదించకపోవడంతో పోలవరం బిల్లులు వెనక్కి తిరిగి వచ్చి నిధుల సమస్య ఏర్పడుతోంది.

Polavaram DPR 2 : పోలవరం ప్రాజెక్టులో 2017-18 ధరలకు సంబంధించిన డీపీఆర్‌ 2 అంశాలను కొలిక్కి తెచ్చేందుకు ఢిల్లీలో సమావేశం కానున్నారు. కొత్త డీపీఆర్‌ ఆమోదం విషయం నెలల తరబడి కేంద్రంలో పెండింగులో ఉంది. కొత్త ధరలు ఆమోదించకపోవడంతో పోలవరం బిల్లులు వెనక్కి తిరిగి వచ్చి నిధుల సమస్య ఏర్పడుతోంది. ముఖ్యమంత్రి జగన్‌ మూడు రోజుల కిందట ఢిల్లీలో జల్‌శక్తి మంత్రి షెకావత్‌ను కలిసి పోలవరం డీపీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నుంచి అందిన సూచనల మేరకు ఈ సమావేశం ఏర్పాటైంది.

సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌, జల వనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర జల వనరులశాఖ కార్యదర్శి పంకజ్‌ కుమార్‌, పోలవరం అథారిటీ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌, కేంద్ర జల సంఘం ఛైర్మన్‌ హల్దార్‌ ఈ సమావేశంలో పాల్గొంటారు. డీపీఆర్‌ 2పై తాము కొన్ని ప్రశ్నలకు సమాధానాలను కోరామని ఇటీవలే పోలవరం అథారిటీ తెలిపింది. ఆ సందేహాలకు ఇప్పటికే సమాధానాలు పంపినట్లు జల వనరులశాఖ అధికారులు చెప్పారు. డీపీఆర్‌ 2 గురించి రాష్ట్రం నుంచి అందించాల్సిన సమాచారం ఏదీ లేదని అధికారులు అంటున్నారు.

ప్రస్తుతం కేంద్ర జల వనరులశాఖ కొత్త డీపీఆర్‌కు పెట్టుబడి అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత కేంద్ర మంత్రి మండలి ఆమోదానికి పంపాలి. పోలవరం డీపీఆర్‌ 2కు సాంకేతిక సలహా కమిటీ 55 వేల 656 కోట్ల రూపాయలకు అనుమతి ఇచ్చింది. తర్వాత రివైజ్డు కాస్ట్‌ కమిటీ ఆ మొత్తంలోనూ కోత పెట్టింది. 47 వేల 725 కోట్ల రూపాయలకే ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు పాత మొత్తానికే పెట్టుబడి అనుమతి అవసరమని వాదిస్తున్నారు. భూసేకరణకు 2 వేల 877 కోట్లు, పునరావాసానికి 2 వేల 118 కోట్లు ఎడమ కాలువలో 14 వందల 82 కోట్లు, కుడి కాలువలో 14 వందల 18 కోట్ల రూపాయల మేర రివైజ్డు కమిటీ కోత పెట్టింది. ఆ మొత్తాలకు ఆమోదం కావాలంటూ ఏపీ జల వనరులశాఖ అధికారులు తమ వాదనను, అందుకు తగ్గ ఆధారాలను చూపుతున్నారు. ఈ అంశంపైనా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Read More : AP State Government : ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యంపై సవరణ

ట్రెండింగ్ వార్తలు