ఏపీలోకి రావాలంటే షరతులు వర్తిస్తాయి: డీజీపీ గౌతమ్ సవాంగ్

  • Publish Date - June 1, 2020 / 03:21 AM IST

లాక్‌డౌన్ 5.0లో అంతరాష్ట్ర రాకపోకలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే పర్మిట్ ఇవ్వకపోవడం.. ఇవ్వడం అనేది రాష్ట్రాలు తీసుకునే నిర్ణయం మీదే ఉంటుందని ప్రకటించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ మాత్రం రాకపోకలపై షరతులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కరోనా వైరస్ కేసులు పెరుగుతూ ఉండడంతో ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా వైరస్ ప్రభావం తక్కువ ఉన్న రాష్ట్రాలు, ఎక్కువ ఉన్న రాష్ట్రాల నుంచి వస్తోన్న ప్రయాణికులను విభజించి క్వారంటైన్‌కు తరలిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియాకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునే వరకు అంతరాష్ట్ర రాకపోకలపై కండీషన్స్ కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఒకవేళ తప్పదు అని అనుకుంటే స్పందన పోర్టల్ ద్వారా ఆప్లై చేసి.. ఈ పాస్ తీసుకోవాలని సూచనలు చేశారు.

కరోనా వైరస్ ప్రభావం తక్కువ ఉన్న రాష్ట్రాల నుంచి వస్తోన్న ప్రయాణికులు విధిగా హోం క్వారంటైన్‌లో ఉండాలని తెలిపారు. వైరస్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వస్తోన్న వారు ఏడురోజులు ఇన్‌స్టిట్యూషనరల్ క్వారంటైన్‌లో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పరీక్షలు చేసే సమయంలో నెగిటివ్ వస్తే ఏడు రోజులు హోం క్వారంటైన్ తప్పనిసరి అని, పాజిటివ్ వస్తే కోవిడ్ ఆస్పత్రికి తరలిస్తామని తెలిపారు.  అయితే తెలంగాణ రాష్ట్రం మాత్రం అంతరాష్ట్ర వాహనాలకు అనుమతిస్తున్నట్టు ప్రకటించింది.

Read: అంతర్రాష్ట్ర ప్రయాణాలకు తెలంగాణ గ్రీన్ సిగ్నల్