×
Ad

AP Politics : వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానితోసహా వారందరికీ బిగ్ షాకిచ్చిన పోలీసులు..

AP Politics : మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానితోపాటు మరో 29మందిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.

AP Politics

AP Politics : మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానితోపాటు 29మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేత సుబ్బన్నను శుక్రవారం విచారణ కోసం మచిలీపట్నం ఆర్.పేట పీఎస్‌కు పిలిచారు. ఈ విషయం తెలుసుకున్న పేర్ని నాని.. పెద్ద సంఖ్యలో అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లి ఆర్.పేట సీఐ ఏసు బాబుపై దౌర్జన్యం చేశారని, ఆయన విధులకు ఆటంకం కలిగించాడని అభియోగం ఉంది. ఈ ఘటనను కృష్ణా జిల్లా ఎస్పీ తీవ్రంగా పరిగణించారు. దీంతో పేర్ని నానిసహా మరో 29మందిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు.

అసలేం జరిగిందంటే..?
ఇటీవల వైసీపీ నేత పేర్ని నాని ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు మెడికల్ కళాశాల వద్ద నిరసన చేపట్టారు. కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయని, నిరసన తెలిపేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా వైసీపీ నేతలు వినిపించుకోలేదు. ఈ క్రమంలో పోలీసులు, వైసీపీ నేతల మధ్య ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగి వారి వద్ద లాఠీలు లాక్కున్నారు. ఈ ఘటనలో 400 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి 41ఏ నోటీసులు ఇచ్చారు. పోలీస్ స్టేషన్ కు విచారణ నిమిత్తం రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

పోలీసులు పిలిచినా తాము చెప్పేవరకు వెళ్లొద్దని వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు తెలిసింది. దీంతో సుబ్బన్నను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పేర్ని నాని వైసీపీ కార్యకర్తలతో కలిసి మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వారు పోలీస్ స్టేషన్లో హల్‌చల్ చేయడంతోపాటు.. సీఐ ఏసుబాబు విధులకు అడ్డుతగిలారంటూ పేర్నినానిసహా 29మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తనపై కేసు నమోదు కావడంపై పేర్ని నాని స్పందించారు. 25ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నాను.. ఏనాడూ పోలీసులతో అగౌరవంగా ప్రవర్తించలేదని అన్నారు. నేను సీఐని బెదిరించలేదు.. కృష్ణా జిల్లా ఎస్పీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేదని అన్నారు.