AP Rains Alert
AP Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారం తెల్లవారు జామున తీరం దాటింది. దక్షిణ ఒడిశాలోని గోపాల్ పూర్ సమీపంలో ఈ వాయుగుండం తీరం దాటినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గడిచిన ఆరు గంటల్లో ఏడు కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదిలినట్లు.. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, 35 నుంచి 45 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. (AP Rains Alert)
ఆ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు..
బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటినప్పటికీ 24 గంటలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇవాళ కూడా సెలవు ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ లో 08942 240557తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మరోవైపు నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఉరకలేస్తున్న కృష్ణమ్మ..
గత కొద్దిరోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్టమ్మ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గంటగంటకు నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర 12 అడుగుల మేర నీటి మట్టం చేరింది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో నాలుగు లక్షల క్యూసెక్కులు
గా ఉంది. ఐదు లక్షల క్యూసెక్కులు వరకు చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రవాహం సాగుతున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు.
కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్..
కృష్ణా, గోదావరి వరద ఉధృతంగా ప్రవాహిస్తున్న నేపధ్యంలో విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి.జయలక్ష్మి కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కృష్ణా, గోదావరి పరీవాహక 13 జిల్లాల కలెక్టర్లతో ఈ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేయాలని, అవసరమైతే ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను జిల్లాల్లో సిద్ధంగా ఉంచాలని, నిత్యవసర వస్తువులు, మెడిసిన్, శానిటేషన్ మెటీరియల్ అందుబాటులో ఉంచాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయా జిల్లాల్ల కలెక్టర్లకు జయలక్ష్మీ సూచించారు.