ఏపీలోని నెల్లూరు జిల్లాలోని పెన్నానది ఇసుక మేటల్లోంచి 200 సంవత్సరాల క్రితం ఇసుక మేటల్లో కూరుకుపోయిన దేవాలయం బైటపడింది. ఇటీవల ఒడిశాలోని మహానదిలో కలసిపోయిన గోపీనాథ ఆలయాన్ని పురాతత్వ పరిశోధకులు కనిపెట్టడం తెలిసిందే. కానీ పెన్నానదిలో బైటపడిన శివుడు దేవాలయాన్ని ఏ పురాతత్వ పరిశోధకుల వల్ల బైటపడలేదు. లాక్ డౌన్ సమయంలో కొంతమంది స్థానిక కుర్రాళ్లు వెలికితీయటం గమించాల్సిన విషయం.
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడు సమీపంలో పెన్నా నది గట్టన ఒక గుడి ఉండేదని పెద్దలు చెబుతుంటారు. కానీ ఎక్కడ ఉందో తెలియదు. కాలగర్భంలో కలసిపోయిన ఆ ఆలయాన్ని కొంతమంది కుర్రాళ్లు పట్టుబట్టి కనిపెట్టారు. ఇసుకమేటల్లో కూరుకుపోయిన ఆలయాన్ని గుర్తించారు.
200 ఏళ్ల కిందట నిర్మించిన దేవాలయం ఇసుక మేటల్లో కూరుకుపోయింది. లాక్‌డౌన్ వల్ల ఖాళీగా ఉన్న కుర్రాళ్లు దాని ఆనవాలు కనిపెట్టడానికి ముందుకొచ్చారు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని మంగళవారం జేసీబీ యంత్రాలతో ఇసుకను తవ్వారు. వారు ఊహించినట్లే ఇసుక గర్భంలో శివాలయం తొంగిచూసింది. దీంతో గ్రామస్తులు వేడుక చేసుకున్నారు.
ఈ దేవాలయంలో మహా విష్ణువు అవతారమైన పరశురాముడు శివలింగాన్ని ప్రతిష్టించాడని స్థానికులు నమ్ముతుంటారు. ఒకప్పుడు మహాద్భుతంగా వెల్లివిరిసిన ఈ ఆలయం 1850లో వచ్చిన వరదలకు నదిలో మునిగిపోయింది. అలా ఇసుకమేటల్లో కూరుకుపోయిందని ఆక్కియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ రామసుబ్బారెడ్డి భావిస్తున్నారు.
200 ఏళ్లనాటి ఈ పురాతన ఆలయం బైటపడటంపై ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ రవీంద్రారెడ్డి మాట్లాడుతూ..స్థానికులు కోరిక ప్రకారం ఈ ఆలయాన్ని పునరుద్ధరిస్తామని..దానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.