Ap sculptors created heart and different models iron waste : కళాత్మకత ఉండాలే గానీ..బంక మట్టితో కూడా అద్భుతాలు సృష్టించవచ్చు. ఆకులతో అద్భుతాలు చేయవచ్చు. మైనంతో మైమరపించే బొమ్మలు చేయొచ్చు. అలా ఇనుము వ్యర్ధాలతో అద్భుతమైన కళాఖండాలకు ప్రాణంపోశారు ఏపీ గుంటూరు జిల్లాలోని తెనాలికి చెందిన తండ్రీకొడుకులు. ఇనుము వ్యర్ధాలతో వాళ్లు చేసిన అద్భుతమైన ఆకృతులను చూస్తే వీళ్లు ఏదో పెద్ద ఇంజనీర్లు అయి ఉండవచ్చని అనుకుంటాం.
కానీ కళకు చదువుకు సంబంధం లేదని నిరూపించారు ఈ తండ్రీ కొడుకులు. వాళ్లు చేసే ఈ ఆకృతులకు మంచి డిమాండ్ ఉంది. హైదరాబాద్ వంటి నగరాలతో పాటు సింగపూర్, మలేసియాలాంటి దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి.
ఇనుప వ్యర్థాలతో చేసిన ఈ ఆకృతుల్ని చూస్తే కళ్లు తిప్పుకోలేం. నిజమైనవేమోననిపిస్తుంది. తెనాలికి చెందిన శిల్పకళాకారులైన తండ్రీకొడుకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు సృష్టించి ఈ కళాఖండాలు..ఈ కళారూపాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి.
తండ్రీకొడుకులు సృష్టించిన వీటిని వార్ఫ్‌రోడ్డులోని వర్క్‌షాపులో గురువారం (డిసెంబర్24,2020) ప్రదర్శించారు. ఆటోమొబైల్ పరికరాలతో భారీ శిల్పాలను తయారుచేస్తూ బెంగళూరు, హైదరాబాద్ నగరాలతో పాటు సింగపూర్, మలేసియా వంటి దేశాలకు ఎగుమతి చేశారు.
ప్రస్తుతం ప్రపంచ రికార్డు సాధన లక్ష్యంతో ప్రత్యేకించి ఈ తరహాలో భారీ కళాకృతులను రూపొందిస్తున్నారు. ఆరడుగుల ఎత్తులో డోలు, తబల, 15 అడుగుల పొడవైన సన్నాయి, ఎద్దుల బండి, క్రీస్తును శిలువ వేసిన బొమ్మను రూపొందించారు.