Water Women
Water Women Pareshamma In AP : ఒకప్పుడు ఇంటికే పరిమితం అయిన మహిళలు ఇప్పుడు ఎంతోమందికి మార్గదర్శులుగా మారారు.తమ ప్రతిభతో తమ ఇంటినే కాదు ఊరుని కూడా చక్కదిద్దుతున్నారు. చినుకు జాడలేని నేలపై కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నారు. అటువంటి ఓ అద్భుతమైన గొప్ప అభివృద్ధికి మార్గదర్శిగా మారారు ఓ సాధారణ మహిళ.ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిరన పారేశమ్మ అనే ఓ సాధారణ మహిళ సాగు బరువైన చోట శిరులు పండేలా చేసింది. బీడువారిన భూములలో పచ్చదనం మొలకెత్తేలా చేసింది. కరవు పల్లెలను సస్యశ్యామలం చేసింది. రైతుల్లో చైతన్యం నింపింది. 16 గ్రామాల పల్లెల్లో చైతన్యం నింపింది పారేశమ్మ అనే ఓ సాధారణ మహిళ. అసాధారణ అభివృద్ధికి బాటలు వేసింది. ఐక్యరాజ్య సమితితో శభాష్ అనిపించుకుంది పారేశమ్మ. చుక్క నీరులేని చోట పంటలేం పండుతాయి అని నిరాశ పడిన రైతన్నల్లో చైతన్యాన్ని నింపి..పంట మార్పిడి, నీటి సంరక్షణ, సాగులో పొదుపు పద్ధతుల గురించి అవగాహన కల్పించిం ఐక్యరాజ్య సమితితో శభాష్ అనిపించుకుంది చిత్తూరు జిల్లాకు చెందిన వాటర్ ఉమెన్ పారేశమ్మ.
చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లోని చాలా గ్రామాలు కరువుకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవి. 1000 నుంచి 12వందల అడుగులు తవ్వితే కానీ చుక్కనీరు కనిపించేది కాదు. నీళ్లు లేకపోవడంతో రైతులు వ్యవసాయాన్ని వదిలేసి.. ఉపాధి కోసం బెంగళూరు వలస వెళ్లిపోయేవారు. నిరాశ నిండిని జీవితాల్లోకి వెలుగులు తెచ్చింది పారేశమ్మ. ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో జల సంరక్షణలో 16 గ్రామాల పల్లెల్లో చైతన్యాన్ని తీసుకొచ్చింది పారేశమ్మ. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నీటి పొదుపు, ప్రత్యామ్నాయ పంటసాగుపై రైతాంగానికి అవగాహన కల్పించారు. ఐక్యరాజ్యసమితి అవార్డుకు ఎంపికయ్యి శెభాష్ అనిపించుకుంది.
చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె సమీపంలోని గోపిదిన్నె గ్రామానికి చెందిన పారేశమ్మ.. 10th క్లాస్ చదివి ఐటీఐ పూర్తి చేశారు. మొదట్లో చిన్నాచితకా ఉద్యోగాలు చేసింది. ఆ తరువాత ఫౌండేషన్ ఫర్ ఎకొలాజికల్ సెక్యూరిటీ సంస్థలో చేరి..పర్యావరణ పునరుద్ధరణ, వనరుల పరిరక్షణ వంటి అంశాల్లో ఈ సంస్థ కృషి చేస్తోంది. ఆ విధానాలను పల్లెలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పించడం పారేశమ్మ పని. ఈ వృత్తి ఆమెకు చాలా ఇష్టాన్ని కలిగించింది. ఆ ప్రాంతంలో నీటి కష్టాలు ఆమెను కదిలించాయి. వ్యవసాయం వదిలేసిన రైతుల్లో తిరిగి వ్యవసాయం చేయించాలనే నిర్ణయించుకున్నారు. ఆ పట్టుదలతోనే 16 గ్రామాల పల్లెల్లో చైతన్యం నింపింది. ప్రపంచవ్యాప్తంగా అభినందనలు అందుకునేలా చేస్తోంది.
కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ ఉద్యోగంలో భాగంగా… తంబళ్లపల్లె మండలంలోని 16 పంచాయతీలు ఆమెకు కేటాయించగా..నూతన సాగు విధానాలు, జలసంరక్షణపై ఆ గ్రామాల్లో రైతులకు పారేశమ్మ చెబుతుండేవారు. అప్పటికే నిరాశలో పడిపోయిన రైతులు ఆమె మాటలు వినేవారు కాదు.పైగా ఆమెపై చిరాకు పడేవారు. అయినా ఆమె ఏమాత్రం నిరాశపడేది కాదు. అక్కడి పరిస్థితులే వారిని అలా మార్చాయని అర్థం చేసుకుంది. మళ్లీ మళ్లీ రైతులకు పదే పదే చెబుతుండేవారు. అలా రైతుల్లో కాస్త మార్పు తేగలిగింది. ఏ ప్రాంతంలో భూసారం ఎంత? నీళ్లు ఎంత లోతులో ఉన్నాయి? ఏ పంట వేయచ్చు? ఇలా ఒక్కో అంశంపైనా అవగాహన తెచ్చుకొని, గ్రామస్తులకు అర్థమయ్యేలా చెప్పేవారు. ఒకప్పుడు విసుగించుకున్న వాళ్లకు.. ఆ తర్వాత పారేశమ్మ మాటలు నచ్చాయ్. ఆమె ఏం చెబితే అది చేసేవారు. వారికి తిరిగి పంటలు పండించగలమనే నమ్మకాన్ని పెంచాయి పారేశమ్మ మాటలు.
ఉపాధి హామీ పనుల్లో నీటికుంటలు, చెరువులు నిర్మించుకునేలా పారేశమ్మ గ్రామస్తులను ప్రోత్సహించారు. టమోటా పంటలకు బదులుగా.. నీటి అవసరం తక్కువగా ఉండే చిరుధాన్యాలు, వేరుసెనగ వంటి పంటలవైపు దృష్టి మళ్లించారు. ఫలితంగా రైతుల పంటకు నీటి అవసరం తగ్గింది. ఆ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. పంటతో పాటు తగిన ఆదాయం కూడా రైతులు అందుకున్నారు. అలా 16 పల్లెల్లో కొత్తగా పచ్చదనం నింపారు పారేశమ్మ. ఆమె కృషికి ఫలితం ఇప్పుడు అక్కడ కళకళలాడే పంటలు. ఈ పచ్చదనం వెనుక పారేశమ్మ ఐదేళ్ల కష్టం ఉంది. పారేశమ్మ సేవలను గుర్తించిన ఐక్యరాజ్య సమితి… ఉమెన్ వాటర్ ఛాంపియన్ అవార్డు ప్రదానం చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ గౌరవం అందుకున్న ఏకైక మహిళ పారేశమ్మే కావటం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం అనటంలో ఏమాత్రం సందేహం లేదు.