Andhra Pradesh Rains
Andhra Pradesh Rains : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్థంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఇది చాలదన్నట్లు ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో కుండపోత వానలు పడతాయంది.
రాష్ట్రంలోని 10 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరితో పాటు ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. మరో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
అటు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశావైపుగా తీవ్ర అల్పపీడనం పయనిస్తోంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.