ట్రాక్టర్ కొనేందుకు నగలు అడిగిన భర్త..క్రికెట్ బ్యాట్‌తో భర్త ప్రైవేట్ భాగాలపై కొట్టి చంపిన భార్య, అత్త

  • Publish Date - July 23, 2020 / 01:27 PM IST

కరోనా కష్టం అంతా ఇంతా కాదు. ఉన్న బతుకుదెరువు పోవడంతో ట్రాక్టర్ కొనుక్కుని పనిచేసుకోవాలని భావించిన ఓ వ్యక్తి భార్య నగలు అడిగి ఆమె చేతిలో దారుణ హత్యకు గురైన అత్యంత దారుణ విషాద ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే..పలమనేరు మండలంలోని మోరం పంచాయితీ పరిధిలోని నక్కలపల్లికి చెందిన గోపీనాథ్‌రెడ్డి అనే 36 వ్యక్తి తన అత్త కూతురు సునీత పెళ్లి చేసుకున్నాడు. వారి పెళ్లి అయిన 13 ఏళ్లు అయ్యింది. వీరికి 9 ఏళ్ల కొడుకు ఉన్నాడు. భార్యా పిల్లలతో కలిసి బెంగళూరులో ఉంటూ కారు కొనుక్కుని క్యాబ్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుండేవాడు. ఈ క్రమంలో కరోనా వచ్చి లాక్‌డౌన్ కష్టాన్ని తెచ్చిపెట్టింది.దీంతో క్యాబ్ నడిపే పరిస్థితి లేకపోవటంతో నాలుగు నెలల క్రితం తన గ్రామానికి వచ్చిన గోపీనాథ్ అదే గ్రామంలో ఉంటున్న అత్తగారింట్లోనే ఉంటున్నాడు.

చేతిలో డబ్బులు లేక వాయిదాలు కట్టలేకపోయాడు. ఫైనాన్స్ కంపెనీ అతడి కారును తీసుకెళ్లిపోయింది. దీంతో ఉపాధి కోసం ట్రాక్టర్ కొనుక్కోవాలని గోపీనాథ్ అనుకున్నాడు. దాని కోసం భార్య నగలు బ్యాంకులో పెడతానని చెప్పాడు. నగలు ఇవ్వమని భార్యను అడిగాడు. కానీ భార్య తన నగలు ఇచ్చేది లేదని ఖరాఖండీగా చెప్పేసింది.

కానీ ఖాళీగా ఉండలేని గోపీనాథ్ రెడ్డి మరో దారి లేక మరోసారి భార్యను నగలు ఇవ్వమని అడిగాడు. ఈ విషయంపై పదే పదే ఇద్దరికీ గొడవలు మొదలయ్యాయి. అలా మంగళవారం (జులై21,2020) మరోమారు నగల విషయంలో గొడవ జరగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భార్య, ఆమె తల్లి కలిసి క్రికెట్ బ్యాట్, రోకలితో అతడిపై దాడిచేసి చితకబాదారు. దీంతో అతడు ప్రైవేటు భాగాలపై దెబ్బలు తగలటంతో గిలగిలా కొట్టుకుంటూ అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు.

ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్రం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భార్య సునీత..అత్త పోలీసులు ప్రశ్నించగా తమ నేరాన్ని అంగీకరించటంతో వారిని అరెస్ట్ చేశారు పోలీసులు.