ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. తోటి ప్రయాణికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బస్సులో ఆమె మరొకరు సెల్ఫీ తీసుకున్నారు. పల్లె వెలుగు బస్సులో షర్మిల విజయవాడ బస్ట్‌స్టాండ్ నుంచి తెనాలికి ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణ, కర్ణాటకలో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లే ఏపీలోనూ కల్పించాలని ఆమె అన్నారు. ఉచిత ప్రయాణ సౌకర్యం అవసరమా అని బస్సులోని మహిళలను షర్మిల అడిగి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కావాలని మహిళలు చెప్పారు. గత ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారని షర్మిల అన్నారు. ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చడంలేదని నిలదీశారు. కాగా, తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏర్పడగానే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయాలు కల్పించిన విషయం తెలిసిందే.
బస్సులో ప్రయాణంపై షర్మిల ఎక్స్‌లో స్పందిస్తూ… “విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలికి బస్సులో తోటి మహిళా ప్రయాణికులతో కలిసి ప్రయాణించడం జరిగింది. చంద్రబాబు అధికారంలో వచ్చి నాలుగు నెలలు అయింది. అయినా ఉచిత బస్సు ప్రయాణంపై ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉచిత ప్రయాణం ఎప్పుడు అని అడుగుతున్నారు. తెలంగాణలో వారంలో అమలు చేశారు. కర్ణాటకలో కూడా అమలు చేస్తున్నారు.
కానీ మీకు మాత్రం పథకం అమలు చేయడానికి ఇబ్బందులు ఏమిటి ? రాష్ట్రంలో ప్రతి రోజూ 20 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు. రోజు మహిళల ద్వారా రూ.7-10 కోట్లు అంటే నెలకు రూ.300 కోట్లు ఆదాయం వస్తుంది. ఉచిత ప్రయాణం కల్పిస్తే…ఈ రూ.300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాల్సి వస్తుంది అని భయమా ?. మహిళల చేత ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు మహిళల కోసం రూ.300 కోట్లు ఖర్చు చేయలేరా ? మీ సూపర్ సిక్స్ హామీల్లో 4 పతకాలు మహిళలవే. ఇందులో ఉచిత ప్రయాణం ఒక్కటే తక్కువ ఖర్చు. ఇలాంటి తక్కువ ఖర్చు పథకం కూడా మీకు అమలు చేయడానికి ధైర్యం రావడం లేదా..?ఇదే అమలు చేయనప్పుడు ఇక పెద్ద పథకాల సంగతి ఏంటి? 5 ఏళ్లు ఇలానే కాలయాపన చేస్తారా?
ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు భద్రత ఉంటుంది. ఇది చాలా మంచి పథకం. చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఉచిత ప్రయాణం అమలు చేయండి. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వండి. మహిళలకు భరోసా కావాలి. మహిళలకు భద్రత విషయంలో ముందడుగు పడాలి. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాలని ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు పంపిస్తున్నాం. రాబోయే రెండు మూడు రోజుల్లో పెద్ద ఎత్తన పోస్ట్ కార్డులు పంపిస్తాం. ఇది చూసైనా వెంటనే చంద్రబాబు గారు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ తరపున హెచ్చరిస్తున్నాం” అని అన్నారు.
#WATCH | Andhra Pradesh Congress President YS Sharmila travels on a ‘Pallevelugu’ RTC bus from Vijayawada Bus Stand to Tenali
(Source: Congress) pic.twitter.com/Ln7gZXHLZw
— ANI (@ANI) October 18, 2024