చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

ఇటువంటి పథకాన్ని తెలంగాణలో రేవంత్ రెడ్డి రెండో రోజే అమలు చేశారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ… చంద్రబాబు అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటిందని చెప్పారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు దాన్ని ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించారు.

ఇటువంటి పథకాన్ని తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండో రోజే అమలు చేశారని అన్నారు. అలాగే, కర్ణాటకలో కూడా మూడు వారాల్లో అమలు చేశారని తెలిపారు. ఈ పథకం అమలుకు ఇంత సమయం ఎందుకు పడుతుందని నిలదీశారు. బస్సులో ప్రయాణం అంటే మహిళలకు రక్షణగా ఉంటుందని తెలిపారు. ఇది మహిళలకు పనికొచ్చే పథకమని చెప్పారు.

విధివిధానాలు పరిశీలించడానికి ఏముంటుందని ప్రశ్నించారు. సూపర్ సిక్స్‌లో ప్రకటించిన అన్ని పథకాలనూ అమలు చేయాలని అన్నారు. అమ్మకు వందనం కింద ప్రతి బిడ్డకు డబ్బులు ఇస్తామన్నారని, ఇప్పుడు ప్రతి తల్లికి రూ.15 వేలు మాత్రమే అని జీవో ఇచ్చారని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై టీడీపీ నేతలు ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారని అన్నారు.

వైజాగ్ స్టీల్‌కు కాప్టివ్ మైన్ ఉండాలని చెప్పారు. మోదీ అంటే మోసం, వెన్నుపోటని, అలాగే, జగన్ కూడా వైజాగ్ స్టీల్‌ను పట్టించుకోలేదని అన్నారు. దీనిపై చంద్రబాబు నాయుడు మాత్రమే మాట్లాడాలని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి వైసీపీ మనిషి కాదని, ఆ పార్టీ అసలు వైఎస్సార్ పార్టీ కాదని అన్నారు. వైసీపీలో రాజశేఖర్ రెడ్డి లేరని చెప్పారు. వైఎస్సార్ ఆశయాలు నిలబెట్టే వారే అయితే జగన్మోహన్ రెడ్డి వాటిని ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు.

 

Also Read: ముచ్చుమర్రి దారుణ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి

ట్రెండింగ్ వార్తలు