బ్రేకింగ్ : ఏపీ ఆర్టీసీ బస్సులు రద్దు

  • Publish Date - January 20, 2020 / 03:05 AM IST

ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరీ ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు పోలీసులు, మరోవైపు జేఏసీ నేతలు, ఇంకోవైపు రైతులు.. అమరావతిలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం నేడు అధికారిక ప్రకటన చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముందు కేబినెట్ భేటీ, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మరోవైపు అసెంబ్లీ ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో అమరావతి ప్రాంతం పోలీసుల పహారాలో ఉంది.

ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అసెంబ్లీ, సచివాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అదే సమయంలో ఆర్టీసీ బస్సులు రద్దు చేయాలని పోలీసులు ఆదేశించారు. పోలీసుల ఆదేశాల మేరకు విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే బస్సులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. పోలీసులు ఆదేశాలతోనే రద్దు చేశామని తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చాకే బస్సులను పునరుద్ధరిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

మూడుకు ముహూర్తం:
మూడు రాజధానులపై సీఎం జగన్ నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మూడు రాజధానులపై అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. ముందుగా కేబినెట్ భేటీ కానుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అటు అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళనలు ఉధృతం చేశారు. అసెంబ్లీ ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం అమరావతి ప్రాంతం పోలీసుల భద్రతా వలయంలో ఉంది. నగరంలో 2వేల 500 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. సీఎం జగన్ కాన్వాయ్ వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీఎం నివాసం నుంచి సచివాలయం వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అసెంబ్లీ పరిసరాల్లో 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు:
అసెంబ్లీ ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపు ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. 13 జిల్లాల్లో ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. టీడీపీ, జేఏసీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. టీడీపీ నేతల నివాసాల దగ్గర పోలీసుల మోహరించారు. అసెంబ్లీ చుట్టూ మూడంచెల పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. 30 యాక్ట్ అమలు అమలు చేశారు. ఓవైపు పోలీసులు, మరోవైపు జేఏసీ నేతలు, ఇంకోవైపు రైతులు.. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రాజధాని పేరెత్తకుండానే ప్లాన్ అమలు:
ఏపీ రాజధాని భవితవ్యం ఇవాళ(జనవరి 20,2020) తేలిపోనుంది. రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణలో కీలక ఘట్టానికి అసెంబ్లీ వేదిక కానుంది. మూడు రాజధానుల ప్రతిపాదనపై అసెంబ్లీలో చట్టం చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే రాజధాని పేరెత్తకుండానే వికేంద్రీకరణ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న యోచనలో జగన్ ప్రభుత్వం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇవాళ్టి నుంచి ఏసీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఏర్పాటు… రాష్ట్రంలో మూడు రాజధానులు… అభివృద్ధి వికేంద్రీకరణ… సీఆర్డీఏ చట్టంలో మార్పు లాంటి కీలక నిర్ణయాలకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. ఈ నిర్ణయాలను ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విభేదిస్తుండటంతో సమావేశాలు గతంలో కంటే వాడీవేడిగా జరిగే అవకాశముంది.

Also Read : జగన్ ఫిక్సయ్యారు : 3 రాజధానులపై నేడే అధికారిక ప్రకటన..?