Apsrtc Rent Buses
APSRTC : సంక్రాంతి పండుగవేళ పట్టణాల నుంచి స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతాయి. పండుగకు వెళ్లేవారు పది రోజుల ముందు నుంచే టికెట్లు రిజర్వేషన్లు చేసుకుంటుంటారు.. ఇక పండుగ ముందు మూడ్రోజులు.. తరువాత మూడ్రోజులు బస్టాండ్‌లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటుంది. అయితే, ఇలాంటి సమయంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల యాజమానులు ప్రయాణికులకు షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు.
ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఈనెల 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ అద్దె బస్సులు నిలిచిపోనున్నారు. అద్దె పెంచాలని ఆర్టీసీలోని అద్దె బస్సుల యజమానుల సంఘాల డిమాండ్
చేస్తున్నాయి. నష్టాలు వస్తున్న దృష్ట్యా తమకు చెల్లించే అద్దె పెంచాలని అద్ద్దె బస్సు యాజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 12 నుంచి అద్దె బస్సులను నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇవాళ ఆర్టీసీయాజమాన్యంకు అద్దె బస్సుల యాజమానుల సంఘాలు నోటీసులు ఇవ్వనున్నాయి.
స్త్రీశక్తి పథకం అమలుతో అధిక రద్దీ వల్ల తమపై అదనపు భారం పడుతోందని అద్దె బస్సుల యాజమానులు చెబుతున్నారు. అధికంగా ఇంధనం ఖర్చు సహా నిర్వహణ పెరిగినందున అద్దె పెంచాలని కొంతకాలంగా వారు కోరుతున్నారు. ఈ క్రమంలో నెలకు అదనంగా రూ.5,200 ఇవ్వడానికి నిర్ణయిస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఆదేశాలు ఇచ్చింది. పెంచిన అద్దెపై అద్దె బస్సుల యాజమానుల సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. తమతో చర్చించి అద్దె మొత్తాన్ని మరింత పెంచాలని కోరుతూ సమ్మె నోటీసులు ఇవ్వాలని అద్దె బస్సుల యాజమానుల సంఘం నేతలు నిర్ణయం తీసుకున్నారు.
2025 నాటికి ఉన్న అధికారిక లెక్కల ప్రకారం.. ఏపీఎస్ఆర్టీసీ వద్ద 11,495 బస్సులు ఉండగా.. వాటిలో సొంత బస్సులు 8,716 ఉన్నాయి. అద్దె బస్సులు 2,779 ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న బస్సులు కాకుండా సంక్రాంతికి 8వేలకుపైగా ప్రత్యేక బస్సులు నడపుతున్నట్లు ఇటీవలే ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో అద్దెబస్సుల యాజమానులు సమ్మెబాట పడితే.. స్పెషల్ బస్సుల సంగతేంటన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. మరోవైపు.. 12వ తేదీ నుంచి అద్దె బస్సులు నిలిచిపోతాయన్న వార్తలతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొంత గ్రామాలకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారిస్తున్నారు.