Aqua Crop Holiday: విజయవాడకు ఆక్వా రైతులు.. ‘ఆక్వా క్రాప్ హాలిడే’ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?
ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ విజయావాడలోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి ఏపీ రొయ్య (Aqua Crop Holiday)రైతు సంఘాల సమాఖ్య పిలుపునిచ్చింది.
- V Santhosh Kumar
- Published on- September 7, 2026 / 01:55 PM IST
Aqua Farmers warning that they will observe a 'crop holiday' for six months.
- విజయవాడ మత్స్యశాఖ కార్యాలయం ముట్టడి
- పెరిగిన రొయ్యల మేత ధరలు
- తీవ్ర ఆక్వా క్రాప్ హాలిడే
Aqua Crop Holiday: ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ (అప్సడా) నిబంధనలను బొందపెడుతూ ఫీడ్ కంపెనీలు అడ్డగోలుగా మేత ధరలు పెంచుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ విజయావాడలోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి ఏపీ రొయ్య రైతు సంఘాల సమాఖ్య పిలుపునిచ్చింది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి రైతులు పెద్ద ఎత్తున విజయవాడ తరలివస్తుండటంతో వాతావరణం వేడెక్కింది.
మేత ధరల భారం.. టన్నుకు రూ.26 వేల వడ్డన:
గతంలో టన్నుకు రూ.4 వేలు పెంచిన కంపెనీలు, ఇటీవల దశలవారీగా మరో రూ.22 వేల వరకు పెంచి రైతులపై పిడుగు వేశాయి. సగటున టన్నుపై రూ.26 వేలు భారం పడటంతో వెనామీ ఉత్పత్తి వ్యయం రూ.300లకు, టైగర్ రొయ్యల ఖర్చు రూ.450లకు చేరింది. మద్దతు ధర లేకపోవడంతో పాటు కౌంట్ వ్యత్యాసాల పేరిట దళారులు దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రొయ్య మేత ధరలను ఏడాది పాటు స్థిరంగా ఉంచాలని, కల్తీ లేని నాణ్యమైన సీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ల వద్ద సరైన మద్దతు ధర కల్పించాలని నిలదీస్తున్నారు.
ఆక్వా క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఏం జరుగుతుంది?
ఆక్వా రైతులు హెచ్చరిస్తున్నట్లుగా 6 నెలల పాటు ‘క్రాప్ హాలిడే(Aqua Crop Holiday)’ (సాగు విరామం) ప్రకటిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఏపీ నుంచి జరిగే వేల కోట్లతో కూడిన సీఫుడ్ ఎగుమతులు పూర్తిగా స్తంభించిపోతాయి, దీనివల్ల విదేశీ మార్పిడి ఆదాయానికి భారీ గండిపడుతుంది. హేచరీలు, ఫీడ్ మిల్లులు, ప్రాసెసింగ్ ప్లాంట్లు క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చి, వీటిపై ఆధారపడ్డ లక్షలాది మంది కార్మికులు, రవాణా రంగం ఉపాధి కోల్పోతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్ వాటాను ఈక్వెడార్, వియత్నాం వంటి దేశాలు సులువుగా కైవసం చేసుకునే ప్రమాదం ఉంది.
సాగు సమ్మె హెచ్చరిక: ప్రభుత్వం దిగిరావాల్సిందే!
ఫీడ్ ధరలను అదుపు చేయకపోతే ఆక్వా రంగాన్ని కాపాడుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా క్రాప్ హాలిడేను పక్కాగా అమలు చేస్తామని ఏపీ రొయ్య రైతుల సమాఖ్య స్పష్టం చేసింది. రైతుల ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడమే కాకుండా, మార్కెట్‌లో సరైన ధరకు అమ్ముకోలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని వాపోతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఫీడ్ ధరలపై నియంత్రణ తేకపోతే ఆక్వా రంగం వినాశనం తప్పదని స్పష్టం చేశారు.
