Harish Rao: ఇది శాసనసభ కాదు.. కౌరవసభ.. సీఎం రేవంత్ సారీ చెప్పాలి… రేవంత్ ప్రభుత్వంపై హరీశ్ రావు ఫైర్
తెలంగాణ శాసనసభ వేదికగా ప్రతిపక్ష నేతలపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Harish rao fire on telangana cm revanth reddy regarding telangana assembly
- ఇది శాసనసభ కాదు కౌరవసభ
- మహిళా ఎమ్మెల్యేలపై పోలీసు దౌర్జన్యం
- సీఎం రేవంత్ సారీ చెప్పాలి
Harish Rao: తెలంగాణ శాసనసభ వేదికగా ప్రతిపక్ష నేతలపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు (Harish Rao)తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రస్తుత శాసనసభ ప్రజాస్వామ్యబద్ధంగా నడవడం లేదని, అది కౌరవ సభను తలపిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ చరిత్రలోనే ఈరోజు అత్యంత నల్లని రోజుగా మిగిలిపోతుందని, ప్రజా సమస్యలను లేవనెత్తుతున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను దుర్మార్గంగా ప్రయోగిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా ప్రజాప్రతినిధులపై అమానుషత్వం.. పోలీసులపై కఠిన హెచ్చరికలు!
ఆందోళన సందర్భంగా పోలీసులు ప్రవర్తించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హరీశ్‌రావు, మహిళా ప్రజాప్రతినిధుల పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగడం, సబితా ఇంద్రారెడ్డి గొంతు నొక్కడం వంటి ఘటనలు అత్యంత అమానుషమని ధ్వజమెత్తారు. మహిళా సభ్యుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన అధికారులను సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టేది లేదని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తోపులాటలో జగదీష్ రెడ్డిని కింద పడేసి తొక్కేందుకు యత్నించారని, కేటీఆర్, సంజయ్, యాదవరెడ్డి, రాజశేఖర రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.
ప్రజా సమస్యల చర్చపై పలాయనం: కాంగ్రెస్ – బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్!
ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు వైఫల్యాలు, పింఛన్లు, మూడేళ్లుగా నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్, ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల నుంచి తప్పించుకోవడానికే ఈ దాడులకు తెగబడ్డారని విమర్శించారు. ప్రభుత్వం వెయ్యి రోజుల విఫల పాలన వాస్తవాలు సభలో బట్టబయలవుతాయనే భయంతోనే తమపై పథకం ప్రకారం కుట్ర పన్ని సస్పెండ్ చేశారని ఆరోపించారు. సభలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లేకుండా చేసి, బీజేపీ – కాంగ్రెస్ కలిసి నామమాత్రపు చర్చలతో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయం చేస్తున్నాయని హరీశ్‌రావు ఎండగట్టారు.
BJP Leaders Arrest: బీజేపీ నేతల అసెంబ్లీ ముట్టడికి యత్నం.. పోలీసులతో తోపులాట, అరెస్టులు
సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలి: ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతాం!
పార్లమెంట్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నల్ల టీషర్టులు వేసుకొని నిరసన తెలిపితే లేని అభ్యంతరం, తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షాలకు ఎందుకు వర్తిస్తుందని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ సమయస్ఫూర్తితో కాపాడకపోయి ఉంటే అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ నేతలను తొక్కేసి ప్రాణాలు తీసేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ గూండాలను, పోలీసులను ప్రయోగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, వెంటనే రాష్ట్ర ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
