Vijay Sai Reddy : ఏపీకి మూడో పార్టీ అవసరం.. సీఎం అభ్యర్థిని నేను కాదు, నా కుటుంబంలోనూ ఎవరూ ఉండరు : విజయసాయిరెడ్డి
Vijay Sai Reddy : ఏపీలో మూడో రాజకీయ పార్టీ అవసరమని విజయసాయిరెడ్డి అన్నారు. తాను సీఎం అభ్యర్థిని కాదని, తన కుటుంబం నుంచి ఎవరూ సీఎం అభ్యర్థిగా ఉండరని స్పష్టం చేశారు. అధికారం దక్కని సామాజిక వర్గాలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.
Vijay Sai Reddy
Vijay Sai Reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు ప్రత్యామ్నాయంగా మూడో రాజకీయ పార్టీ ఎంతైనా అవసరం ఉందని విజయసాయిరెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ ప్రధాన పార్టీలుగా ఉన్నాయన్నారు. జనసేన మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాడే పటిమను చూపించడం లేదని విజయసాయి విమర్శించారు.
టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఈ పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధంలో ప్రజలు నలిగిపోతున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
టీడీపీని ‘రెడ్ బుక్ పార్టీ’గా, వైసీపీని ‘రప్ప రప్ప పార్టీ’గా విజయసాయిరెడ్డి అభివర్ణించారు. రాష్ట్ర సంపద, ప్రజల ప్రయోజనాల విషయంలో ఈ 2 పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ, వైసీపీ రెండూ కుటుంబ పార్టీలేనని, ప్రజలకు గోరంత ప్రయోజనం కల్పించి తమ కుటుంబాలకు కొండంత ప్రయోజనం కల్పించడమే వాటి అజెండాగా ఉందని ఆరోపించారు.
Read Also : BRS Party: బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు.. రోడ్డెక్కనున్న గులాబీ శ్రేణులు!
రెడ్లు, కమ్మలే సీఎం కావాలా?.. ఇతర వర్గాలకు అవకాశం ఇస్తాం :
తాను స్థాపించబోయే పార్టీకి సీఎం అభ్యర్థి తాను కాదని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తన కుటుంబంలో ఎవరూ సీఎం అభ్యర్థిగా ఉండరని అన్నారు. ప్రభుత్వంలో తాను మెంటర్‌గా మాత్రమే ఉంటానని చెప్పారు. సామర్థ్యం, నాయకత్వం, దేశభక్తి ఉన్న వ్యక్తులకు సీఎం అయ్యే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.
రెడ్లు, కమ్మ సామాజిక వర్గాల వారే సీఎం కావాలా? అంటూ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీ, కాపు, ఎస్సీ సహా అనేక బలమైన సామాజిక వర్గాలు ఉన్నాయని తెలిపారు. ఆయా వర్గాల్లో సమర్థులైన నాయకులు ఉన్నప్పటికీ వారిని రాజకీయంగా తొక్కేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇప్పటివరకు అధికారానికి రాని సామాజిక వర్గాలకు సీఎం అయ్యే అవకాశం కల్పిస్తామని వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెబుతున్నానని అన్నారు. రెడ్డి సామాజిక వర్గంపై రెండేళ్లుగా అధ్యయనం చేశానని, దీనిపై 350 పేజీల పుస్తకం రాశానని విజయసాయిరెడ్డి వెల్లడించారు.
